ఖిలావరంగల్, ఆగస్టు 15: సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని లిఖించిందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ అన్నారు. వరంగల్ ఐడీఓసీ మైదానంలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య, డీసీపీ రవీందర్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్టు, గేదెలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, పోడు భూములకు పట్టాల పంపిణీ, కుల వృత్తులవారికి ఆర్థిక చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తు న్నారన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు అన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో బృహత్తర పథకాలను రూపొందించారన్నారు. 2022-23 యాసంగి కాలానికి 1,43,750 మంది రైతులకు రూ.132.16 కోట్లు, 2023 వానకాలానికి రూ.1,47,395 మంది రైతులకు రూ.119.17 కోట్లు బ్యాంక్ ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేశారని చెప్పారు. అలాగే జిల్లాలో 360 మంది రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున రూ. 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు కింద నర్సంపేట నియోజకవర్గం ఎంపికైందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా 50 శాతం సబ్సిడీతో రూ.75 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు మంజూరైందన్నారు. ఇదీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 50 శాతం సబ్సిడీతో 51 వేల రైతు కుటుంబాలకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెం.83ను విడుదల చేసిందన్నారు. దీంతో నర్సంపేట హెల్త్ హబ్‌గా మారనుందన్నారు. ఇంకా నర్సంపేటలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ఉద్యానవన పంటల పరిశోధనా కేంద్రం) మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 31 విడుదల చేసిందన్నారు.
2020-22లో మక్కజొన్నకు సంబంధించి పంటలు నష్టపోయిన 4,224 మంది రైతులకు రూ.1,71, 56,383.97 చెక్కులను ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మార్చి 2023లో నష్టపోయిన పంటలకు సంబంధించి 56,843 మంది రైతులకు రూ.60,92, 59,000 నిధులు మంజూరైనట్లు చెప్పారు.
టీఎస్-ఐపాస్ ద్వారాజిల్లాలో 724 పారిశ్రామిక యూనిట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,146 అనుమతులు మంజూరు చేశామన్నారు. టీ-ఐడియా పథకంకింద 2016 నుంచి ఇప్పటి వరకు 421 దరఖాస్తులకు సబ్సిడీ కింద రూ.39.09 కోట్లు మంజూరు చేశారన్నారు. టీ-ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ పారిశ్రామకవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 1,938 దరఖాస్తులకు రూ.94.61 కోట్లు రాయితీ మంజూరు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో నాలుగు దశలుగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 601 చెరువులకు మరమ్మతు చేశారని, ఇందు కోసం రూ.178.60 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా పరిధిలో చిన్న నీటి పారుదల ద్వారా 815 చెరువుల కింద 65,695 ఎకరాలకు నీరు ఇచ్చమన్నారు. రబీకి 35,923 ఎకరాలకు నీటిని అందించినట్లు చెప్పారు. అలాగే 14 చెక్ డ్యాములకు 8 డ్యాముల పనులు పూర్తయినట్లు తెలిపారు.
సొంత జాగ ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 4,370 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అలాగే జిల్లాలో అన్ని రకాల పింఛన్లు 1,27,013 ఉన్నాయన్నారు.
3,271 మంది గిరిజనులను గుర్తించి అటవీ హక్కుల పత్రాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచిందన్నారు. 100 శాతం రాయితీతో చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 11మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షలు బీమా డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది హరితహారం కింద 25,95,150 మొక్కలను నాటే లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు 13,89,500 మొక్కలు నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సీపీ రంగనాథ్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న 193 మంది ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు.