వరంగల్, నవంబర్ 9 : వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే చాలు స్లాబ్లు కురుస్తున్నాయి. వాన నీటి కోసం టబ్బులు పెట్టే పరిస్థితి. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఉద్యోగులు ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం రెండు సెక్షన్లలో పై కప్పు కూలి కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. వర్షం నీళ్లు గోడల వెంట కారుతూ కరెంట్ షాక్ కొడుతున్నాయి. ఇలాంటి భయానక పరిస్థితుల్లో బల్దియా పాత భవనంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, భవనాన్ని కూల్చివేయాలా? లేక మరమ్మతు చేయించాలా? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాత భవనం స్థితిపై నిపుణుల నివేదిక తీసుకోవాలని నిర్ణయించారు. ఐదు దశాబ్దాలకు పైబడిన బల్దియా పాత భవనం వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నిట్ ఇంజినీర్లకు లేఖ రాశారు.
బల్దియా పాత భవనాన్ని పూర్తిగా కూల్చివేయడమా? లేక మరమ్మతు చేయించడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలంటే నిట్ ఇంజినీర్లు నివేదిక ఇవ్వాలని అధికారులు అంటున్నారు. మరో వారం రోజుల్లో పాత భవనంపై నివేదిక వస్తుందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం పాత భవనంలో అదనపు కమిషనర్, సీఎంహెచ్వో, ట్యాక్సేషన్ అధికారి, పీఆర్వో, లీగల్ అఫీసర్, బయాలజిస్ట్ చాంబర్లు, పౌర సేవల విభాగం, బర్త్, ఇన్వార్డు, అండ్ డెత్, అకౌంట్స్, సాధారణ పాలన సెక్షన్లతో పాటు కౌన్సిల్ హాల్ ఉంది. అయితే , ప్రస్తుతం పాత భవనం కూల్చివేయాలని నిట్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ఇప్పడికిప్పుడు భవనం కూల్చివేసే పరిస్థితులు లేవు. కొత్త భవనం నిర్మాణమైన తర్వాతనే కూల్చివేయాల్సి ఉంటుంది. పాత భవనం కూల్చివేస్తే ఇటీవలనే రూ. 1.50 కోట్లతో పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నగర పాలక సంస్థ పాలన భవన నిర్మాణానికి పునాది రాయి పడేది ఎప్పుడో అన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్ ఆవరణలోని ఇండోర్ స్టేడియం ముందు భాగంలో పాలన భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల రూ. 32 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే, భవనం నిర్మించేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారు. నిధులు విడుదల, టెండర్ల ప్రక్రియ పూర్తయినా పనులు ప్రారంభంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.