ఖిలావరంగల్, ఏప్రిల్ 28: మధ్య భారతాన్ని ఇండియన్ గాజాగా మోదీ ప్రభుత్వం మార్చిందని సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేసి కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర భద్రత దళాల దాడులను నిలిపి వేయాలని కోరుతూ సీపీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఖిలా వరంగల్‌లోని అమర వీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ప్రారంభించిన గ్రీన్ హంట్ మొదలు నేటి ఆపరేషన్ కగార్ వరకు అనేక మంది ఆదివాసీ ప్రజలను కేంద్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు చంపేస్తున్నాయని ఆరోపించారు. అక్కడున్న సహజ ఖనిజ సంపదను అంబానీ, ఆదానీలకు, సామ్రాజ్యవాద దేశాలకు బహుళ జాతి కంపెనీలకు అప్పగించేందుకు నరమేథాన్ని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత ఐదు రోజులుగా తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూబింగ్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టు పార్టీ నేతలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ప్రకటించి నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమ సంస్థల నాయకులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులతో మాట్లాడి శాంతి చర్చలు జరిపి మధ్య భారతదేశంలో ప్రశాంత వాతావరణం నెలకొల్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, సుద్దాల వీరన్న, ఇనుముల కృష్ణ, ఎండీ అక్బర్, బండి చంద్రమోళి తదితరులు పాల్గొన్నారు.