నల్లబెల్లి, మార్చి 28 : శివ సత్తుల పూనకాలు, కల్లు కావళ్లు, నెత్తిన బోనాలతో మహిళలు తరలివచ్చారు. బద్ది పోచమ్మ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బోలోనిపల్లె గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి బద్ది పోచమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. అంతేగాక ప్రభ బండ్లు, పలారం బండ్లతో డప్పు సప్పుల మధ్య గొర్రె పొట్టేళ్లను అమ్మవారికి సమర్పించేందుకు తీసుకువస్తూ ఊరేగింపుగా శివ సత్తుల నృత్యాల మధ్య బద్ది పోచమ్మ జాతర అత్యంత కోలాహలంగా జరుగుతుంది.
కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుందిన బద్ది పోచమ్మ తల్లికి భక్తులు ప్రతి ఏటా అమ్మవారికి వేయికళ్ల బోనాలను సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అమ్మవారికి బోనం సమర్పించారు. జాతరలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సాయిరమణ, ఎస్ఐ గోవర్ధన్ నేతృత్వంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.