నెక్కొండ, మే 16: మహిళలు స్వీయ రక్షణ, హక్కుల పట్ల చైతన్యం, సమస్య ఎదురైనప్పుడు తగిన మార్గాలను ఎంచుకునే ధైర్యం మహిళల్లో పెంపొందించడమే సఖి కేంద్రాల ప్రధాన లక్ష్యమని సఖి సెంటర్ కేర్ టేకర్లు తిరుమల, స్వప్న అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే సఖి సెంటర్ సేవలపై నెక్కొండ మండలంలోని గొల్లపల్లిలో గ్రామ సంఘం మహిళలు జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, బాలికలు హింస, అన్యాయాలను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖి కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు.
సఖీ కేంద్రాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఉచితంగా కౌన్సిలింగ్, పోలీస్ సహాయం, న్యాయ సేవలు, వైద్య సేవలు తాత్కాలిక వసతి సైతం మహిళలు బాలికలకు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు 181 కు కాల్ చేసినట్లయితే రెస్క్యూ చేసే అవకాశం ఉంటుందన్నారు. వృద్ధుల కోసం 14567 కు పిల్లల కోసం 1098 ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సిసి శారద వివోఏ సదానంద చారి ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్ స్వామి గ్రామ సంఘం ప్రతినిధులు మహిళలు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు