వరంగల్ చౌరస్తా: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలకు ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మామునూరు ఏయిర్ పోర్టు వరకు తీసుకువచ్చి, ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడు పవన్ కళ్యాణ్ మృతదేహానికి వెంకటాపురం తహసిల్దార్ లక్ష్మీరాజయ్య, వడ్ల శ్రీధర్ మృతదేహానికి వాజేడు తహసిల్దార్ శ్రీరాముల శ్రీనివాస్, సందీప్ మృతదేహానికి వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.
అనంతరం మృతదేహాలకు ఎంజీఎం ఫోరెన్సిక్ వైద్యుల బృందం శవపరీక్షలు జరిపి మృతదేహాలను పోలీసులకు అప్పగించారు. పవన్ కళ్యాణ్ కు తల భాగంలో బుల్లెట్ తగలడం మూలంగా, వడ్ల శ్రీధర్ కు కడుపు, చాతి, గుండె బాగాలలో బుల్లెట్లు తగిలినట్లు, సందీప్‌కు మెడ భాగంలో రెండు బుల్లెట్లు తగిలినట్లు పంచనామాలో గుర్తించినట్లు సమాచారం. మూడు మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పోస్టుమార్టం పూర్తయ్యిన వెంటనే స్థానిక మట్టెవాడ పోలీసులు మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి తరలించారు.