ములుగు,సెప్టెంబర్27(నమస్తేతెలంగాణ)/తాడ్వాయి/వరంగల్: విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖాధికారులపై పోడు సాగుదారులు విరుచుకుపడి విచక్షణా రహితంగా దాడి చేసిన తీరు ములుగు జిల్లాలో తీవ్ర అలజడిని రేపింది. తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎఫ్ఎస్వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీవోలు శరత్చంద్ర, సుమన్‌లు, బేస్క్యాపు సిబ్బంది ఎట్టి శ్రీను, జీపు డ్రైవర్ రాజేందర్ గురువారం రాత్రి పెట్రోలింగ్ వెళ్లారు.
తాడ్వా యి వైపునకు వస్తున్న జేసీబీని నిలిపి స్వాధీ నం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన జేసీబీ య జమాని గంట సూరజ్‌రెడ్డి, మరో నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎఫ్ఎస్వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీలు శరత్చంద్ర, సుమన్‌లకు తల, చేతులకు తీవ్రగాయాలయ్యా యి. వారిని అట వీ శాఖాధికారులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెవెన్యూ భూమిలో పైప్‌లైన్ కందకాలు తీసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా అటవీ శాఖాధికారులు బూతులు తిడు తూ తన తమ్ముడు శశిధర్‌పై బండరాయితో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కోపంతో వారిపై దాడి చేశామని సూరజ్‌రెడ్డి తెలిపారు.
అటవీ అధికారులపై దాడిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకరతోపాటు పలు ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. డీఆర్వో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఫారెస్టు అధికారులపై దాడి చేసిన సూరజ్‌రెడ్డి, గంట శశిధర్, పాండవుల చింటు, పాండవుల సాయి, మ్యాదరి శ్రీకాంత్‌ను కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశామని ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ తెలిపారు. విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.
అటవీ ఉద్యోగులకు అండగా ఉంటాం
అటవీ శాఖ ఉద్యోగులపై దాడులు చేస్తే ఉపేక్షించబోమని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్‌లోని ప్రైవేట్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి వినోద్‌కుమార్, బీట్ అధికారి శరత్‌చంద్రను మంత్రి సురేఖ పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కోలుకునే వరకు నిరంతరం సమీక్షించాలని మంత్రి డీఎఫ్‌వో రాహుల్ కిషన్జాదవ్ను అదేశించారు. మంత్రి సీతక్క హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడి అటవీశాఖాధికారులకు అండగా ఉంటామన్నారు.