హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 17 : హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండోరోజు అదే జోరు కొనసాగింది. గత రికార్డులను తిరగరాసేందుకు వరంగల్ కేంద్రంగా మారింది. విజయం సాధించిన అథ్లెట్లు వరంగల్ నేలను ముద్దాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బంగారు పతకమే లక్ష్యంగా అథ్లెట్లు దూసుకెళ్లారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభ కనబర్చారు. అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించారు. పోటాపోటీగా జరిగిన పోటీల్లో అథ్లెట్లు చిరుతల్లా దూసుకెళ్లారు.
శుక్రవారం ఉదయం 20 వేల వాక్, ట్రిపుల్ జంప్, 1500, 110 మీటర్స్ హార్డిల్స్, డిస్కస్‌త్రో, 100 మీటర్స్ హార్డిల్స్, జావెలిన్ త్రో, 200 మీటర్స్ పరుగుపందెం, హైజంప్ , పోల్ వాల్ట్ పోటీలు నిర్వహించారు. సాయంత్రం డిస్కస్‌త్రో, హైజంప్ , షార్ట్‌పుట్ , పోల్ వాల్ట్, 100, 110 మీటర్స్ హార్డిల్స్, 400, షార్ట్‌పుట్ , 200, లాంగ్ జంప్ , జావెలిన్ త్రో, 800, 1500 మీటర్స్ పరుగుపందెం పోటీలు నిర్వహించగా అథ్లెట్లు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ వరద రాజేశ్వర్ రావు, రాష్ర్ట కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోతు అశోక్ కుమార్ , ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడిపాటి వెంకటేశ్వర్ రెడ్డి ప్రతిభకనబర్చిన అథ్లెట్లకు మెడల్స్ అందజేసి అభినందించారు.
ఒలంపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం తీసుకొస్తా : గోల్డ్ మెడలిస్ట్ మహిమాదారి
మాది రాజస్థాన్ రాష్ర్టం జైపూర్. నాన్న రాజ్ కుమార్ వ్యవసాయం చేస్తారు. అమ్మ శ్రవణి దేవి ప్రోత్సహంతో ఫస్ట్‌టైం 20 వేల వాక్‌లో బంగారు పతకం సాధించా. అండర్ -20 నేషనల్స్ బ్రాంజ్ మెడల్, రేస్‌వాక్ లో సిల్వర్ మెడల్, వరల్డ్ యూనివర్సిటీలో బ్రాంజ్ మెడల్ సాధించాను. వచ్చే ఒలంపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించి తీసుకొస్తా. కోచ్ సీతారాం కఠోర శిక్షణ, పట్టుదలతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 6 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ప్రతిరోజు నెలకు 3 వేలు డైట్‌కు ఖర్చవుతుంది, నాన్న వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్పాన్సర్లు ముందుకువస్తే మరిన్ని పతకాలు తీసుకొస్తా.
12 బంగారు పతకాలు సాధించా : ఆర్తి
20 వేల వాక్ సిల్వర్ మెడల్ సాధించాను. జారండ్లో జరిగిన నేషనల్స్‌లో 10 వేల కిలోమీటర్ల వాక్‌లో బంగారు పతకం సాధించాను. తల్లిదండ్రుల స్ఫూర్తితో బంగారు పతకం తీసుకొస్తా. మా నాన్న జగత్ సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మ మనోజ గృహిణి. సౌత్ అమెరికాలో జరిగిన అండర్ -20.. 10 వేల వాక్‌లో ఫస్ట్ ఉమెన్‌గా రికార్డు నమోదు చేశాను. ఇప్పటివరకు 12 బంగారు పతకాలు సాధించాను. 2028లో ఒలింపిక్స్‌లో బంగారు పతకం తీసుకువడమే నా లక్ష్యం.