హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు చిరుతల్లా దూసుకెళ్లారు. శనివారం నిర్వహించిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేష్‌బాబు హాజరై విజేతలకు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లు లాంటిదన్నారు.
పోరాటాలగడ్డ నుంచి ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి అథ్లెట్లు విశ్వవేదికలపై తమ ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ రెండ్రోజుల పాటు నిర్వహించిన అండర్-6 (కిడ్స్) 8-20 బాలబాలికల, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో అథ్లెట్లు పాల్గొని ప్రతిభచాటి పతకాలు సాధించారన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అండర్-18 (యూత్) బాలబాలికలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో నిర్వహించే 21వ జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 18న మెన్ అండ్ ఉమెన్స్ నేషనల్స్ మీట్ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహించనున్నట్లు సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు నాగరాజు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.