వరంగల్ చౌరస్తా, మే 25: విదేశీ విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులపై ఆంక్షల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. బుధవారం ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సూట్లాడారు. విదేశీ విద్యార్థులపై అమెరికా ఆంక్షలు విధిస్తూ టార్గెట్ చేస్తుందని అన్నారు. ఇతర దేశాల మధ్య ఆ వచ్చిన తగాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని పెంచుతున్నదని విమర్శించారు.
తనకు అనుకూలంగా వ్యవహరించని దేశాలపై కక్ష కట్టి ఎగుమతులు, దిగుమతుల విషయంలో పన్ను భారాన్ని మోపి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ట్రంప్ విధానాలను వ్యతిరేఖించాల్చిన మోదీ ప్రభుత్వం మోకాల్లపై మోకరిల్లి దేశానికి, విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు, దేశ ప్రజలకు తీరని అన్యాయాన్ని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ వైఫల్యాలలను కప్పిపుచ్చుకోవడానికి సాధించని విజయాన్ని సాధించినట్లు ప్రచారం చేసుకుంటుందని అన్నారు. ఉగ్రదాడిని సైతం తన మతోన్మాద ప్రచారానికి మోడీ ప్రభుత్వం వినియోగించుకుందని ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మద్దతు ధర చట్టం తీసుకురావడంతో పాటుగా అమలు జరిపేలా చేయడం, నిత్యావసరాల ధరల తగ్గింపు అంశాలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కిరణ్ జిత్ సింగ్ షేకాన్, మహేంద్ర నేహాల్, అనుభవ్ దాక్షిశాస్త్రి, కాటం నాగభూషణం, వల్లేపు ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాడగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, కార్యవర్గ సభ్యులు గోని కుమారస్వామి, ఎన్రెడ్డి హంసారెడ్డి, నంది రవి, కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అప్పరపురి నర్సయ్య, మాలి ప్రభాకర్, మల్లికార్జున్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.