జనగామ, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుకా సత్తయ్య పేరిట జనగామ జిల్లా కేంద్రంలో కళాక్షేత్రాన్ని నిర్మించాలని ఒగ్గుకళా మహోత్సవ సదస్సు తీర్మానించింది. అలాగే ఒగ్గు పూజారులకు ఆరోగ్య, జీవిత బీమా కల్పించడంతో పాటు అర్హులైన వృద్ధ కళాకారులకు నెలకు రూ.6వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంసృతికశాఖ, జనగామ జిల్లా ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు.
తొలుత పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా మీదుగా ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు వివిధ కళారూపాలతో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం ‘ఒగ్గు కళా వికాసం- భవిష్యత్ ప్రణాళిక’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ నిరుపేదలైన ఒగ్గు పూజారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, తెలంగాణ సాంసృతిక సారథిలో ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఈ సదస్సులో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కేవలం వృత్తిని నమ్ముకొని బతుకుతున్న ఒగ్గు బీర్ల పూజారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఒగ్గు బీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఒగ్గు రవి, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు, ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం, ఒగ్గు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి జంగిడి సిద్ధులు, ప్రచార కార్యదర్శి బర్ల అనిల్ కుమార్, కురుమ సంఘం పట్టణ అధ్యక్షుడు బాల్దె మల్లేశం పాల్గొన్నారు.