ఎల్కతుర్తి, ఏప్రిల్ 21 : ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేశారని తెలంగాణ కోసం ఆయన చేసినన్ని రాజీనామాలు దేశంలో మరే నాయకుడూ చేయలేదని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి, ప్రాణాలకు తెగించి సాధించుకున్న రాష్ర్టానికి మళ్లీ అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ నా యకత్వంలో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని, జీఎస్టీలో దేశంలో 3వ స్థానానికి తీసుకెళ్లారని, వృద్ధి రేటులో అగ్రభాగానికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత వెనకబడి ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రగ తి పథంలోకి తీసుకెళ్లారని, కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్తుందో గమనించాలన్నారు. నేడు అన్నీ పడిపోయి, రాష్ర్టాన్ని దిగజార్చారని పేర్కొన్నారు. హామీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేసిందని, ముఖ్యంగా రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని, నమ్మి మోసపోయామని ఉద్యోగులు సైతం చెబుతున్నారని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను జోక్‌గా చేశారని మండిపడ్డారు. ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చక, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ దగా చేసిందన్నారు. నీళ్లు లేక, కరంటు రాక మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, గ్రామాలు, పట్టణాల్లో నీళ్లు లేక బోరు బావుల దగ్గర గొడవలు మొదలయ్యే పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపారు. కసితో, కక్షతో కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని, ఒకవేళ చేస్తే అంత బాగానే ఉందని, తామే అబద్ధాలు చెప్పామని ప్రజలు భావిస్తారని ప్రాజెక్టును ఎండబెట్టారని.. దేవాదుల కరంటు బిల్లులు కట్టకుండా ఎండగొట్టారని ఆరోపించారు.
ప్రజలు తమకు జరుగుతున్న మోసాలు, అన్యాయాలను తట్టుకోలేక ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తారని, శ్రీలంకలో దాడులు చేసి ప్రభుత్వాన్ని మార్చారని, మరో దేశంలో కూడా తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. కానీ మనది ప్రజాస్వామ్య దేశమని, తమ కోపాన్ని కూడా ప్రభుత్వానికి కసితో చూపించాలనే ఈ సభకు ప్రజలు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వివరించారు. ఏడాదిన్నర ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం కంటే కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకున్నదని విమర్శించారు. ఇంకా ఇలాగే ఉంటే ఇంకా తెలంగాణను నాశనం చేస్తారనే ప్రజలకు అన్నీ వివరించేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఆగమవుతున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌కు ఉన్నదని, అందుకే ప్రజలను జాగృతం చేసేందుకే సభ నిర్వహిస్తున్నామని వివరించారు. దేశంలో కేసీఆర్ వలె బహిరంగ సభలు ఎవరూ పెట్టలేదని, గతంలో వరంగల్‌లో 10లక్షల మందితో సభ నిర్వహించామని గుర్తుచేశారు. తాము రజతోత్సవ సభ అంటే ప్రజలు మాత్రం ప్రభుత్వంపై తిరుగుబాటు సభగా మార్చుకున్నారని వివరించారు. ఏప్రిల్ 27 ఎప్పుడు వస్తదా అని, కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని ప్రజలే కాకుండా దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు లింగంపల్లి కిషన్‌రావు, నాగుర్ల వెంకన్న, వాసుదేవారెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి, నాయకులు చింతం సదానందం, కడారి రాజు, గొల్లె మహేందర్, ఎల్తూరి స్వామి, తంగెడ నగేశ్, తంగెడ మహేందర్, దుగ్యాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దగాపడ్డ ప్రతి ఒక్కరు వస్తారు. 25 ఏండ్లలో అనేక ఉద్యమాలు, సుపరిపాలన అందించిన ఘనత కేసీఆర్‌దే. పాతికేళ్ల సంబురాన్ని రజతోత్సవ సభగా కేసీఆర్ ఆదేశాల మేరకు జరుపుతున్నాం. కనీవినీ ఎరగని రీతిలో ఈ సభ ఉంటుంది.
కేసీఆర్ ప్రసంగం వినేందుకు యావత్ దేశం ఎదురు చూస్తున్నది. అంచనాకు మించి జనం వస్తారు, వారందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తాం. 20 రోజులుగా ఉమ్మడి జిల్లా నాయకత్వంతో కలిసి రేయింబవళ్లు పనిచేస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములివ్వడం అభినందనీయం. ఎండాకాలం కనుక చల్లని నీళ్లు, మజ్జిగ అందజేస్తున్నాం. రిటైర్డ్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది వలంటీర్లు సేవలనందిస్తారు. వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం.