హనుమకొండ సబర్బన్, మార్చి 18 : నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. ఫలితంగా మంత్రులు తాము పాల్గొనాల్సిన ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ను బుధవారం మంత్రులు ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే అనూహ్యంగా మంగళవారమే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించేందుకు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత నీటి డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి, అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద మంత్రుల ప్రెస్‌మీట్‌కు నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఈ క్రమంలో ప్రెస్‌మీట్ వేదిక వద్ద అధికారులు ఏర్పాటు చేయగా, అందులో స్థానిక ఎ మ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటో లు ముద్రించలేదు. దీనిని గుర్తించిన ‘నమస్తే తెలంగాణ’ ఫొటోలు తీసుకుంటుండగా తప్పును గుర్తించిన నీటిపారుదల శాఖ అధికారులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. అప్పటికే ప్రెస్‌మీట్ సమయం దగ్గరపడడంతో మిన్నకుండిపోయారు. అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి సైతం అక్కడే ఉన్నప్పటికీ జరిగిన తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. ఈ విషయం అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలకు చేరడంతో పలువురు వేదిక పైకి ఎక్కి ఫ్లెక్సీని చూపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వేదికకు ఇరువైపులా ఉ న్నా కార్యకర్తలు, నాయకులు సైతం నీటి పారుదలశా ఖ అధికారులు నిద్ర పోతున్నారా? మా సారు ఫొటో నే మర్చిపోతారా? అంటూ నిలదీశారు. వేదిక వద్ద జరుగుతున్న ఫ్లెక్సీ రగడ దేవన్నపేట పంప్‌హౌస్ వద్ద ఉన్న మంత్రుల బృందానికి చేరినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కొందరు స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామంలోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలు తీసుకొచి ఫ్లెక్సీపై అతికించే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికే ఇక్కడి పరిస్థితి తెలుసుకున్న మంత్రులు ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఫ్లెక్సీలో కేవలం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మా త్రమే స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినప్పటికీ ఆయన ఫొటో చిన్నగా వేసి పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రుల ప్రెస్‌మీట్ సమాచారంతో మధ్యాహ్నం 3.30 గంటలకే ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన పాత్రికేయుల కోసం ఒక్క కుర్చీ కూడా వేయకపోవడం విమర్శలకు దారితీసింది. అలాగే తాగునీటి ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో విలేకరులు ఇబ్బంది పడ్డారు.
అధికారులపై మంత్రుల ఆగ్రహం
ప్రతిష్టాత్మక దేవాదుల ఫేజ్-3 పనుల్లో జాప్యం, రైతులకు నీటి విడుదలలో తలెత్తుతున్న సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దేవాదుల ఫేజ్-3లో ఒక పంపును ప్రారంభించేందుకు నీటిపారుదలశాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మంగళవారం దేవన్నపేటకు వచ్చారు. అక్కడే అధికారులతో అం తర్గత సమావేశం ఏర్పాటు చేసి పంప్‌హౌస్ నిర్వహణ, పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిట్స్ బుక్ నిర్వహణతో పాటు ఇతర పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఏర్పాట్లలో విఫలమయ్యారని చివాట్లు పెట్టారు. అలాగే, ఫ్లెక్సీ వివాదంలో పలు శాఖల అధికారులకు గట్టిగా క్లాసు పీకినట్లు తెలస్తున్నది.