గీసుగొండ, మార్చి 10: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగు బంగారమైన స్వామి వారి జాతర ఏటా మార్చిలో జరుగుతుంది. హోలీ పర్వదినం తర్వాత వారం రోజులపాటు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భూనీలాదేవి సమేత లక్ష్మీనర్సింహస్వామిని కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలు ఇస్తాడని భక్తుల నమ్మకం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి గాంచింది. జాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. వరంగల్ నగరానికి 18 కిలో మీటర్ల దూరంలో వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న కొండపై స్వామి వారు కొలువై ఉన్నారు.
18వ దశాబ్దంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుట్టుపై స్వయంభూగా వెలిశాడని చరిత్ర చెబుతున్నది. స్వామి వారి గుట్టుచుట్టూ ఆనుకుని కొమ్మాల గ్రామానికి చెందిన కొమ్మిడి వంశస్తుల భూములు ఉండేవి. ఆ కాలంలో రైతులు పచ్చజొన్నలు పండించేవారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. పంట కోయడానికి కూలీల కొరత కారణంగా ఓ రైతు ఒక్కడే పంటను కోయడానికి వెళ్లాడు. కొంతపంటను కోసి అలసిపోయి గుట్టకు ఆనుకొని ఉన్న చెట్టు నీడలో సేద తీరాడు. లేచి చూసేసరికే పంట మొత్తం కోసి ఉంది. ఆ రైతు ఆశ్చర్యపోయి చుట్టుపక్కల ఆరా తీయగా ఓ చెట్టుకింద బాలుడు కూర్చొని ఉన్నాడు. ‘నీ పంటను నేనే కోశాను’ అని బాలుడు చెప్పడంతో రైతు నమ్మలేదు. అప్పుడు ఆ రైతు బాలుడితో నీకు ఎం కావాలో చెప్పు అన్ని అడిగాడు. నాకు ఏమీ వద్దు. కొన్ని నీళ్లు కావాలని అడుగగా, రైతు నీళ్లు ఇచ్చాడు. వాటిని బాలుడు తాగాడు. ఆ తర్వాత బాలుడు కోసిన పచ్చజొన్నల పంటలో నుంచి పిడికెడు పచ్చజొన్న కట్టను చేతిలో పట్టుకొని గుట్టువైపు నడవసాగాడు. అతడి వెంట పంట మొత్తం లేచి వెళ్తున్నది. ఇదేంటని రైతు బాలుడిని అడిగేలోగా మాయమైపోతాడు. వెంటనే రైతు ఇంటికి వెళ్లి గ్రామంలో పెద్దమనుషులకు ఈ విషయం చెప్తాడు. ఎవరూ నమ్మలేదు. అదేరోజు రాత్రి ఆ బాలుడు ఆ రైతు కలలోకి వచ్చి నేను శ్రీలక్ష్మీనర్సింహస్వామిని. గుట్టపై స్వయంభూగా వెలిసి ఉన్నా. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వు గుట్టపై వచ్చి నాకు పూజలు చేస్తే నీకు, నీ కుటుంబానికి సకల సౌభాగ్యలు ఇస్తానని చెప్పి మాయమైపోతాడు. మరుసటి రోజు ఆ రైతు గుట్టుపై వెళ్లి చూడగా నిజంగానే స్వామి నిలువెత్తు విగ్రహం ఉంది. అప్పటి నుంచి స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పురానాల ద్వారా తెలుస్తున్నది. స్వామి వారి కల్యాణం రోజు కొమ్మిడి వంశస్తుల ఇంటి నుంచి స్వామి వారికి తలంబ్రాలను అర్చకులు తీసుకొచ్చి కల్యాణాన్ని కొమ్మిడి వంశస్తుల చేతుల మీదుగా జరిపించడం ఆనవాయితీ. జాతరలో రాజకీయ ప్రభబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి 8 గంటలకు అధ్యయనోత్సవాలతో ప్రారంభమైనట్లు ధర్మకర్త ఫౌండర్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకుడు కాండూరి రామాచార్యులు తెలిపారు. 19న వరకు రోజూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామ తెలిపారు. 20న స్వామి వారికి భక్తులు మొక్కులు చెల్లిస్తారని, 21న స్వామి వారికి అర్చన, 22న రాత్రి స్వామి రథోత్సవం, 23న స్వామి సతీసమేతంగా విశ్వనాథపురంలో పారువేటకు బయల్దేరి వెళ్తారు. రాత్రి పుష్పయాగం, నాగవెల్లి కార్యక్రమాలు జరుగుతాయి. 24న శతఘాటభిషేకం, పండిత సన్మనంతో జాతర ముగుస్తుందని వారు వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాటు చేశాం. రెండు క్యూలైన్లతోపాటు ప్రత్యేక దర్శనం కోసం మరో క్యూలైన్ ఏర్పాటు చేశాం. వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి ద్వారా స్వామి ఆర్చి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తాయి.
– గుళ్లపల్లి శేషగిరి, ఈవో