గిర్మాజీపేట, ఫిబ్రవరి 12: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కాక మాధవరావు తెలిపారు. ఈనెల 15వ తేదీన (బుధవారం) ప్రారంభమై మార్చి 2తో పేర్కొన్నారు. జనరల్ కోర్సులకు 36, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు 8, మొత్తం 44 పరీక్షా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడుతలో 15 నుంచి 20 వరకు జరిగే జనరల్ కోర్సులకు 13, ఒకేషనల్ కోర్సులకు 7 పరీక్షా కేంద్రాలను కేటాయించామని, రెండో విడుతలో ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే జనరల్ కోర్సులకు 10, ఒకేషనల్ కోర్సులకు 2 పరీక్షా కేంద్రాలు, మూడో విడుతలో ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు జరిగే జనరల్ కోర్సులకు 13, ఒకేషనల్ కోర్సులకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. జనరల్ కోర్సులకు 3,806, ఒకేషనల్ కోర్సులకు 1,826, మొత్తం 5,632 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని నోడల్ అధికారి కాక మాధవరావు తెలిపారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు అవసరమైన జవాబు పత్రాలను డీఐఈవో కార్యాలయంలో పొందవచ్చని, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు సమావేశం ఏర్పాటుచేసి సూచనలు చేస్తామని, ఈ పరీక్షలకు డెక్ మెంబర్లుగా కే జితేందర్‌రెడ్డి, కే శ్రీధర్ విధులు నిర్వర్తిస్తారని ఆయన వివరించారు.