వరంగల్ చౌరస్తా, జనవరి 19 : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలకు వసతుల లేమి ముప్పుగా మారింది. నిరాటంకంగా కొనసాగాల్సిన శస్త్ర చికిత్సలు యంత్ర పరికరాల లోటు, వైద్య నిపుణుల కొరత కారణంగా నిలిచిపోయాయి. పది రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో న్యూరో సర్జరీ, యూరాలజీకి సంబంధించిన శస్త్ర చికిత్సలతోపాటు గుండె సంబంధిత కార్డియోథోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (సీటీవీఎస్) సర్జరీలు కొనసాగకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు నెల రోజులుగా చిన్నా చితక ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చిన వారికి యంత్ర పరికరాలు పని చేయడం లేదంటూ హైదరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు సిఫారసు చేస్తున్నారు. సుమారు 10 రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల చూపు ప్రభుత్వ వైద్యం వైపునకు మళ్లినా అందుకు తగిన విధంగా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా, కనీస వసతులు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరాటంకంగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.