కాశీబుగ్గ, జూన్ 3: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే వరంగల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్య తెలిపారు. మార్కెట్ యార్డులో జరుగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, సంధ్యారాణి, గొఆర్ఓ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సోమవారం తనిఖీ చేశారు. సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మూడంచెల భద్రత ఉంటుందని, సిబ్బంది, పోలీస్ బందోబస్తు మొత్తం 2500 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనున్నందున టేబుల్స్ ఏర్పాటు, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, ఇన్చార్జిలకు నియోజకవర్గాల వారీగా శిక్షణ నిర్వహించి, రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించిన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. 4వ తేదీ ఉదయం 6గంటలకు ఎన్నికల కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో తుది ర్యాండమైజేషన్ నిర్వహించి ఆయా కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ రౌండ్ల వారీగా ఎన్కోర్లో ఫలితాలు అప్లోడ్ చేసేలా ఎన్కోర్ సిబ్బంది, ఐటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.