వరంగల్, డిసెంబర్ 26 : నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. బాలుడికి శాపంగా మారింది. దవాఖాన యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను నియమించుకొని ప్యాకేజీల పేరుతో ఒప్పందం కుదుర్చుకొని అనుభవం లేని డాక్టర్లతో అపరేషన్లు చేయించి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా జిల్లా వైద్యాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 నెలల క్రితం బంధన్ అసుపత్రిలో అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించి చావు అంచుల దాకా వెళ్లిన ఘటన మరువక ముందే శ్రీఉదయ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో జూలై 2న గురిజాల గ్రామానికి చెందిన కొక్కు తనీష్(13)కు చేసిన ఆపరేషన్ వికటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొక్కు తనీష్ కడుపు నొప్పితో బాధపడుతుంటే తండ్రి సదానందం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకురాగా, పరీక్షలు చేసిన వైద్యులు ఇది అపెండిసైటిస్ అని, ఆపరేషన్‌కు రూ. లక్ష ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖర్చు భరించే శక్తిలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న సదానందంకు అక్కడే ఉన్న ఓ బ్రోకర్ శ్రీ ఉదయ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ. 40 వేల ప్యాకేజీతో ఆపరేషన్ చేస్తారని చెప్పాడు. రూ. 40 వేలు కట్టడంతో ఆపరేషన్ చేసి మూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆపరేషన్ చేసిన చోట చీము కారడంతో దవాఖానకు తీసుకురాగా రెండు రోజులు ఉంచుకొని పంపించారు. ఇలా మూడు సార్లు కావడంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ జితేందర్‌ను అడిగితే నిర్యక్షంగా సమాధానం చెప్పి ముఖం చాటేశాడు. ఈ క్రమంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
దవాఖాన నిర్లక్ష్య వైద్యంపై డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యకు ఫిర్యాదు చేసిన మూడు నెలలకు స్పందించి ఈ నెల 12వ తేదీన శ్రీఉదయ్, యశోద ఆసుపత్రికి బాలుడికి సంబంధించిన కేషీట్ పంపించాలని లేఖ రాశారు. ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌కు లేఖ రాసి కేషీట్లను పరిశీలించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా శ్రీఉదయ్ ఆసుపత్రి నిర్లక్ష్య వైద్యంపై బాలుడి తండ్రి సదానందం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు నాలుగు నెలల కిత్రం, గత నెల మరోసారి ఫిర్యా దు చేశాడు. దీంతో సీపీ హనుమకొండ ఏసీపీని విచారించాలని ఆదేశించినా ఎలాంటి పురోగతి లేదు. తాము మానసికంగా కుంగిపోయాయని, ఆర్థికంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటున్నది.