పోచమ్మమైదాన్, ఆగస్టు 8 : ఆనాడు ఆప్కో (ఆంధ్రప్రదేశ్) అధికారులు ఓరుగల్లుకు వచ్చి వరంగల్ కొత్తవాడలోని చేనేత సంఘాల నుంచి కార్పెట్లు కొనుగోలు చేశారు. స్టాంపింగ్ కూడా వేశారు. తీరా నేడు కార్పెట్లు మాకొద్దంటూ మొండికేయడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. అక్కడి గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా టీడీపీ ప్రభుత్వం కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన కార్పెట్లను బండిల్స్ చేయించి, ప్రస్తుతం స్టాకును మీ వద్దనే ఉంచుకోవాలంటూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఆర్డర్ జారీ చేయడంతో కొత్తవాడ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దీంతో నేతన్నలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే… ఓరుగల్లు నేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లను ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించడానికి ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) అధికారులు ఏటా రెండు, మూడుసార్లు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతిసారి లక్షలాది రూపాయల కార్పెట్లను కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ నేతన్నలకు ఉపాధి లభించేది. తెలంగాణలోని టెస్కో, ఏపీలో ఆప్కో ద్వారా కార్పెట్లు కొనుగోలు చేస్తుండటంతో నేతన్నలకు చేతినిండా పని దొరికే పరిస్థితి ఉండేది.
ఏపీ నుంచి వచ్చిన ఆప్కో అధికారులు వరంగల్ కొత్తవాడలోని దాదాపు 15 సంఘాల నుంచి కారెట్లను కొనుగోలు చేయడానికి అక్కడి టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను గత నెల 21, 22 తేదీల్లో పంపించారు. కొత్తవాడ, ఆటోనగర్, తుమ్మలకుంట, ఉప్పుమల్లయ్య తోట, ఎల్బీ నగర్‌లోని పలు సంఘాల నుంచి దాదాపు 21 వేల కార్పెట్లను (రూ. 65 లక్షలు) ఖరీదు చేశారు. స్టాంపింగ్ కూడా వేసి బండిల్స్ కట్టారు. అలాగే రానున్న కాలంలో 2 లక్షల కార్పెట్లను కొనుగోలు చేస్తామని హామీ ఆర్డర్ కూడా ఇచ్చారు.
దీంతో ఇక్కడి నేతన్నలు కార్పెట్లను బండిల్స్ కట్టి సిద్ధం చేశారు. ఈ నెలలో వీటిని తీసుకెళ్లడానికి ఏపీ నుంచి లారీలు వస్తాయని ఎదురుచూస్తున్న తరుణంలో అక్కడి ఆప్కో అధికారులు కార్పెట్లను తీసుకోవడం లేదంటూ సమాచారం పంపించారు. ఖరీదు చేసిన బిల్లును కూడా క్యాన్సిల్ చేస్తామన్నారు. అయితే స్టాంపింగ్ వేసిన తర్వాత ఈ కార్పెట్లను ఎవరూ కొనుగోలు చేయరని, బిల్లు కూడా చేసిన తర్వాత తమ పరిస్థితి ఏమిటంటూ నేతన్నలు ప్రశ్నిస్తున్నారు.
కార్పెట్లు, బెడ్ షీట్లకు పేరొందిన కొత్తవాడ ప్రాంతంలో అధికంగా ఉన్న కార్మికులు పలు సంఘాల ద్వారా చేనేత ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పెట్లను కొనుగోలు చేస్తుండడంతో నేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. కాగా, పలు నేత సంఘాల ప్రతినిధులు కొద్ది రోజుల నుంచి విజయవాడలో ఉంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని తెలుస్తున్నది.
చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండీకి, చివరకు అక్కడి ఓఎస్డీ, చేనేత శాఖ మంత్రి సబితకు విన్నవించినా అంగీకరించడం లేదని సమాచారం. కనీసం కొనుగోలు చేసిన వాటినైనా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికులు, సంఘాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ సర్కారు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కనీసం కొనుగోలు చేసిన కార్పెట్లను తీసుకునేటట్లు చేయాలంటున్నారు.