నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్15 : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు భగ్గుమన్నా రు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఇతర పనుల కోసం వెళ్తున్న మహిళలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ వందలాది మంది బారికేడ్లను తోసుకుంటూ మంత్రి ఇంటి ముందుకు చేరుకొని ధర్నా చేశారు. దీంతో పోలీసులు, సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వా దం, తోపులాట జరిగింది. పోలీసుల దౌర్జన్యం నశించాలి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో సుబేదారి సీఐ రంజిత్ కుమార్ అంగన్వాడీలను వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకచ్చిందని, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయించిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనకి తీసుకోవాలన్నారు. అలాగే సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సోమవారం ములుగులో మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.