హనుమకొండ, నవంబర్ 12: కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీకి సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు విభాగాధిపతి మామిడి లింగయ్య మాట్లాడుతూ అందెశ్రీ కవిత్వం తెలంగాణ భాష, భావజాలం, సాంస్కృతిక మన్ననలకు ప్రతీక అన్నారు. అందెశ్రీ సాహిత్యం ప్రజాచైతన్యానికి అద్దం పట్టిందని, ఆయన పద్యం ప్రతి సామాన్యుడి నోటి మాటగా నిలిచిపోయిందన్నారు.
అందెశ్రీ గీతాలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయన్నారు. తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, కేయూ పాలక మండలి సభ్యులు చిర్ర రాజు, అధ్యాపకులు కర్రె సదశివ్, సంగాల కోమల, బానోత్ స్వామి, పరిశోధక విద్యార్థులు, పీజి విద్యార్థులు పాల్గొని అందెశ్రీ రచనల నుంచి ఎన్నో గీతాలను పఠించి ఆయన సాహిత్యప్రతిభను స్మరించారు. అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు.