హనుమకొండ, జూలై 16 :చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు, వేర్వేరు కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ విద్య, వైద్యం అందని బాలలకు చేయూత అందించేందుకు తాజాగా ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ పథకం ద్వారా అనాథలు, సెమీ ఆర్ఫన్స్ (18 సంవత్సరాల్లోపు వారు) చదువు మానేయకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో ఇప్పటికే గుర్తింపు సర్వే చేపట్టామని, దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, సెమీ అర్పన్స్, నిరాశ్రయులను (0 నుంచి 18 సంవత్సరాలలోపు వారు) గుర్తించేందుకు అధికారులు జిల్లాలో సర్వే చేపట్టారు. సంరక్షకుల వద్ద ఉన్నవారు, పీఎం చిల్డ్రన్స్, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, బాల్యవివాహాల సందర్భంగా రిస్క్యూ చేసిన వారు, వైకల్యం ఉన్నవారు, పారిపోయి వచ్చిన వారు, వీధి బాలలు, చైల్డ్ బెగ్గర్స్ లాంటి వారిని గుర్తించి వారిని చదువుకొనేందుకు ప్రొత్సహిస్తారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలపై గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో గుర్తిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా దరఖాస్తులు, నేరుగా దరఖాస్తు చేసుకున్నవారిని బాలల పరిరక్షణ విభాగం అధికారులు పరిశీలిస్తారు. అర్హులైన వారి వివరాలను రాష్ట్ర పోర్టల్ (మిషన్ వాత్సల్య పోర్టల్)లో నమోదు చేస్తారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో సైతం నివేదిక అందజేస్తారు. సీడీపీవో ద్వారా ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు.
అర్హులు ఎవరంటే…
కన్నవారిని కోల్పోయిన 18 సంవత్సరాలలోపు వారు, ఒంటరిగా ఉండే తల్లిదండ్రుల పిల్లలు, విడాకులు తీసుకున్న వారి పిల్లలు, కరోనా సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఇండ్ల నుంచి పారిపోయిన వారు, పునరావాసం అవసరం ఉన్నవారు, పీఎం చిల్డ్రన్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, బాల్యవివాహాల సందర్భంగా రిస్క్యూ చేసిన వారు, వైకల్యం ఉన్నవారు, వీధి బాలలు, చైల్డ్ బెగ్గర్స్ లాంటి వారు ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు సమీపంలోని అంగన్ వాడీ సెంటర్లకు వెళ్లి దరఖాస్తులు తీసుకొని పూర్తి చేయాలి. దరఖాస్తుతో పాటు అనాథలైతే తల్లిదండ్రులు మరణ ధ్రువీకరణ పత్రం, పిల్లల విద్యార్హతలు, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు అకౌంట్, ఆధార్, రేషన్ కార్డుల ప్రతులు, ఫోటో జత చేసి దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సాయం..
మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు 4వేల చొప్పున సంవత్సరానికి రూ. 48వేలు అందజేయనున్నారు. మూడేళ్లపాటు వీటిని అందించనున్నారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతను శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. పథకంపై గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఇప్పటికే హనుమకొండ జిల్లాలో పీఎం కేర్ పథకం ద్వారా ఒక్కొక్కొరికి నెలకు రూ. 2వేల చొప్పున 11 మందికి ఆర్థికసాయం అందజేస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
అనాథల విద్య కోసమే ‘వాత్సల్య’
అనాథలు, సెమీ అర్పన్స్, నిరాశ్రయులైన వారి విద్యను కొనసాగించడానికి మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. జిల్లాలో ఇలాం టి వారిని గుర్తించే ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగుతుంది. ఎవరైనా ఉంటే సమీపంలోని అంగన్వాడీ టీచర్ల ద్వారాగానీ, బాల రక్షా భవన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. ఇప్పటికే జిల్లాలో పీఎం కేర్ స్కీం ద్వారా 11 మంది లబ్ధి పొందుతున్నారు.
– మధురిమ, జిల్లా సంక్షేమాధికారి, హనుమకొండ