నెక్కొండ, ఆగస్టు 2: తల్లి మంచాన పడి నరకయాతన అనుభవిస్తున్నా ఆమె కొడుకులు పట్టించుకోలేదు. కాలివేళ్లకు పుండ్లు అయి చీమలు పీక్కుతింటున్నా కనీసం కనిక రం చూపలేదు. పదిహేను రోజులుగా ఆ వృద్ధురాలు బాధ భరిస్తున్నా కుటుంబసభ్యులెవరూ దయలేకుండా వదిలేయగా.. ఇదేమిటని ప్రశ్నించినందుకు ఇరుగు, పొరుగుపైనే ఎదురుదాడికి దిగారు. ఈ దారుణ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో చంద్రుగొండలో శుక్రవారం వెలుగు చూసింది.
విషయం తెలిసిన సీడీపీవో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధరాలిని కొత్త ఇంట్లోకి తరలించడంతో పాటు ఆమె బాగోగులు పట్టించుకోకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె కొమురమ్మ పెద్దకొడుకు, కోడలు పరమేశ్-విజయ వరంగల్‌లో నివాసం ఉంటుండగా, చిన్న కొడుకు, కోడలు కుమారస్వామి-పద్మలు చంద్రుగొండలోనే నివాసం ఉంటున్నారు. చిన్నకోడలు పద్మ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం వృద్ధురాలు జారి పడడంతో కాలు విరిగి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇద్దరు కొడుకులు వరంగల్‌లోని చికిత్స చేయించి ఇక లాభం లేదనుకొని చంద్రుగొండకు తీసుకువచ్చారు. కొమురమ్మను పాత ఇంటి ముందు విరిగిన మంచంలో నివాసం ఉంచి పట్టించుకోవడం మానేశారు. దీంతో వృద్ధురాలు లేవలేక బెడ్‌మీదే ఉండడంతో వీపు తదితర భాగాల్లో పుండ్లయ్యాయి. స్నానం లేకపోవడం, పరిశుభ్రతలేకపోవడంతో చీమలు పట్టి కాళ్లను తినేస్తున్నాయి.
అంగన్వాడీ టీచరైన కోడలును ఇదేంటని ప్రశ్ని స్తే తిడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గత పదిరోజులుగా వృద్ధురాలి ఇంటి సమీపాన ఉంటున్న అనుముల సుప్రజారెడ్డి భోజనం పెట్టడంతోపాటు శుక్రవారం పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, పాత్రికేయులకు సమాచారం అందించారు. దీంతో కరెంట్ తదితర సౌకర్యాలులేని శిథిలమైన ఇంటిలోకి కొడుకు తరలించి విరిగిన మంచంలో పడుకోబెట్టారు. కన్నతల్లి బాగోగులు పట్టించుకోకుండా వదిలేసిన వైనం తమ దృష్టికి రాగానే పోలీసులను పంపించి సమాచారం సేకరించామని, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి వృద్ధురాలిని ఆదుకుంటామని ఎస్సై మహేందర్ తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి సుమన్‌రెడ్డి, వైద్యాధికారి రాహుల్ వృద్ధురాలి ఇంటికి చేరుకొని వైద్యం అందిస్తున్నారు. కాగా, జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి ఆదేశాల మేరకు నర్సంపేట సీడీపీవో శ్రీదేవి శుక్రవారం రాత్రి చంద్రుగొండ గ్రామాన్ని సందర్శించి వృద్ధురాలి దయనీయ పరిస్థితిపై విచారణ జరిపి అంగన్వాడీ టీచర్ పద్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకులు, కోడళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పాత ఇంటి నుంచి కొమురమ్మను కొత్త ఇంటిలోకి తరలించారు. వృద్ధురాలి బాగోగులను విస్మరిస్తే చట్టపరమైన శిక్షకు అర్హులవుతారని కుటుంబ సభ్యులను హెచ్చరించారు.