రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కథను కంచికి చేర్చింది.. ఇన్నాళ్లు రేపు, మాపు అంటూ రైతులను ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. గత మూడు విడతల్లో మాదిరిగానే ఈసారీ తూతూ మంత్రంగానే మాఫీ అయ్యిందనిపించింది. నాలుగో విడతలో తమ పేరుంటుందని ఆశ పడ్డ అన్నదాతలను నిరాశకు గురిచేసింది. ఇంతకూ తమకు రుణమాఫీ అవుతుందా? లేక ఆ ప్రక్రియకు కాలం చెల్లినట్లేనా? అనే సందిగ్ధంలో రైతులున్నారు. రెండు, మూడు నెలల నుంచి తమ వివరాలు సేకరించిన కాంగ్రెస్ సర్కారు తమకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడుతున్నారు. అన్ని అర్హతలున్నా, అధికారులకు పత్రాలన్నీ సమర్పించినా తమకెందుకు మాఫీ కాలేదంటూ ఆవేదన చెందుతున్నారు. సరైన సమయంలో ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామంటూ మరోసారి ప్రత్యక్ష ఆందోళనలకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పథకానికి ఇక కాలం చెల్లినట్లేనా? అని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో కూడా పొందుపర్చింది. అయితే అధికారంలోకి రాగానే రేవంత్ సర్కార్ రుణమాఫీ విషయాన్ని అటకెక్కించింది. బీఆర్ఎస్ రుణమాఫీ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రక్రియ అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కన పెట్టి రుణమాఫీకి అనేక ఆంక్షలను ప్రభుత్వం జోడించింది.
రేషన్‌కార్డు ఆధారంగా మాఫీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, పన్నులు చెల్లించే వారికి వర్తించదని ప్రకటించింది. ఒకేసారి కాకుండా విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది రైతులకు మాఫీ చేయాల్సి ఉండగా అనేక కొర్రీలతో వారి సంఖ్యను కుదించేసింది. గత మూడు విడతల్లో మాఫీ కాని రైతులంతా నాలుగో విడతలో తమ పేరుంటుందని ఆశగా ఎదురుచూడగా ఇందులో కూడా సగం మందికి నిరాశే మిగిలింది. కానీ, ప్రభుత్వం మాత్రం నాలుగు విడతల్లో సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందని ప్రకటించడంతో అన్ని అర్హతలున్నా తమ పేర్లు లిస్టులో లేవని ప్రతి గ్రామానికి చెందిన అనేక మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. అసలు రుణమాఫీ ఎంత మందికి అయ్యిందనే స్పష్టత వ్యవసాయశాఖాధికారుల వద్ద కూడా లేదు. దీనిపై ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాకపోతే పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గతంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేసిందని రైతులు గుర్తు చేస్తున్నారు. అటు పెట్టుబడి కోసం సకాలంలో రైతుబంధు ఇచ్చినట్లు కర్షకులు చెబుతున్నారు. ఇక గతంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు సభల్లో మాట్లాడుతూ రూ. 2 లక్షల పైచిలుకు రుణం ఉన్న రైతులు అధికంగా ఉన్న డబ్బులను చెల్లిస్తే వారికి కూడా వర్తింపజేస్తామని ప్రకటించడంతో వేలాది మంది రైతులు అప్పులు చేసి మరీ చెల్లించారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేశామని ప్రకటించడంతో కాంగ్రెస్ తమను మోసం చేసిందని, ఇక మా సంగతి ఇంతేనా? అంటూ ఆందోళన చెందుతున్నారు.
రూ. 1,350 ఎక్కువున్నందుకు మాఫీ కాలే..
నేను, నా భార్య, కొడుకు పేరిట ఉన్న భూమిపై బ్యాంకులో పంట రుణం తీసుకున్నాను. ముగ్గురిది కలిపి రూ. 2,01,350 అయ్యింది. అయినా ముందుగానే రూ. 2 లక్షలలోపు ఉంచుదామని రూ. 10 వేలు తిరిగి చెల్లించిన. ఆ వివరాలు వ్యవసాయ అధికారులకు కూడా సమర్పించిన. నాలుగో విడత రుణమాఫీలో నా రుణం మాఫీ అయితదని ఆశతో ఎదురుచూసిన. అయితే వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు సాయంతో ఆన్లైన్లో చూసుకుంటే మా రుణం విషయమై ఇంకా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని కన్పిస్తున్నది. కేవలం రూ.1,350లు ఎక్కువగా ఉన్నందుకు నాకు రుణమాఫీ కాకపోవడం బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మర్చిపోవడం దురదృష్టకరం.
– పొలాటి గోపాల్‌రావు, రైతు, సూరారం, ఎల్కతుర్తి
రూ. 94 వేలు మాఫీకాలే..
కమలాపూర్ : నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట పెట్టుబడి కోసం ఉప్పల్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ. 94 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల లోపు మాఫీ చేస్తదంటే నమ్మినం. నాలుగు విడుతల్లో డబ్బులు వేయడంతో ప్రతిసారీ వ్యవసాయ, బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్న. అయినా నా రుణం మాఫీ కాలేదు. నాకెందుకు కాలేదని వ్యవసాయాధికారి వద్దకు వెళ్తే లిస్టులో నీ పేరు చూపిస్తలేదని, బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి నీ పేరు పంపారో? లేదో? అడగమన్నడు. బ్యాంకులో అడిగితే పేరు పంపినం అంటున్నరు. నాలాంటి చిన్న రైతులకే అప్పు మాఫీ కాలేదు.. మొత్తం చేసినమని సీఎం చెపుతుండు.
– పసుల సాంబయ్య, రైతు, భీంపల్లి, కమలాపూర్ మండలం
కేసీఆర్ సార్ మాఫీ చేసిండు..
నర్సింహులపేట : కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు నాకు రూ. 82,500 మాఫీ అయినయ్. తరువాత నాకున్న 2.13 ఎకరాల భూమికి ఏపీజీవీబీలో రూ. 1.10 లక్షల అప్పు తీసుకున్న. కాంగ్రెస్ సర్కార్ వస్తే మాఫీ చేస్తారన్న ఆశతో వాళ్లకే ఓటేసిన. నాకు రూ. 2 లక్షలలోపే ఉన్నా మాఫీ కాలేదు. మా అన్నదమ్ములం వేరుబడి పదేళ్లు అయితాంది. ఎవరి రేషన్ కార్డు వారికి ఉంది. కానీ అధికారులు చేసిన తప్పిదానికి నాకు మాఫీ కాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోమంటే రెండు నెలల కిందట అన్ని జిరాక్స్‌లు ఇచ్చిన. అయినా చివరి విడతల నాకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు తగిన బుద్ధి చెబుతున్నరు. సమయం వచ్చినప్పుడు మా రైతుల సత్తా చూపెడుతం.
– గుగులోత్ రమేశ్, రైతు, ఫకీరతండా, నర్సింహులపేట మండలం
ఎందుకైతలేదో తెల్వడం లేదు..
లింగాలఘనపురం: నాకు రుణమాఫీ ఎందుకైతలేదో తెల్వడం లేదు. నా పేర 2.18 ఎకరా లు, నా భార్య సుజాత పేర 2 ఎకరాల భూమి ఉన్నది. లింగాలఘనపురం గ్రామీణ బ్యాంకులో నేను రూ. 1.18 లక్షలు, నా భార్య 1.10 లక్షల పంట రుణం తీసుకున్నం. కాంగ్రెస్ సర్కారు వస్తే రూ. 2లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పింది. దీంతో రుణాలను రెన్యువల్ చేసుకుని నేను రూ. 96 వేలు, నాభార్య రూ. 98 వేల రుణం తీసుకున్నం. అధికారులు రుణమాఫీ అయితదని చెప్తున్నరు కానీ ఇప్పటి వరకు కాలేదు.
– దయ్యాల శ్రీనివాస్, రైతు, లింగాలఘనపురం
రూ. 34వేలు కట్టించుకున్నరు.. లిస్టులో పేరు లేదన్నరు..
గణపురం : మాది బస్వరాజుపల్లె. నాకు రెండెకరాల పొలం ఉన్నది. గణపురం యూనియన్ బ్యాంకులో 1.34 లక్షల క్రాప్‌లోన్ తీసుకున్న. రేవంత్‌రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తనని ఎన్నికలప్పుడు చెప్పిండు. ఎంతో సంబురపడ్డం. అప్పులన్నీ తీరుతై అనుకున్నం. బ్యాంకుకు పోయి మాఫీ గురించి అడిగితే వాళ్లు మీది రూ. 34 వేలు కట్టుమన్నరు. ఊళ్లో అప్పుచేసి కట్టిన. తీరా చూస్తే లిస్టుల నీపేరు లేదు పొమ్మంటున్నరు. మూడు నెలలు బ్యాంకు చుట్టూ తిరిగిన. రుణమాఫీ మాత్రం కాలే. ఏం లాభం లేదు.. కాంగెసోళ్లవి అంతా ఝూటా మాటలు.
– బండారి స్వామి, రైతు, బస్వరాజు పల్లి, గణపురం మండలం
నా ఆధార్ మరొకరికి లింక్ అయ్యింది..
నర్మెట : నేను మా ఊరికి సంబంధించిన బచ్చన్నపేట ఏపీజీవీ బ్యాంకులో రూ. 1.70 లక్షల రుణం తీసుకున్న. ప్రభుత్వం ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. బ్యాంకు, వ్యవసాయాధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగిన. అయితే నాకు డీసీసీబీలో రూ. 70 వేలు రుణం తీసుకున్నట్లు ఆన్లైన్లో చూపిస్తున్నది. నేను అసలు అక్కడ ఏ రుణం తీసుకోలేదు. నా ఆధార్ కార్డు వేరే వ్యక్తికి లింక్ అయ్యిందని అధికారులు చెబుతున్నరు. రెండు కలిపి నా అకౌంట్లో రూ. 2.40 లక్షలు అని వస్తున్నది. ఈ విషయమై అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదు. రెండు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వెంటనే నాలాంటి వారందరికి రుణమాఫీ చేయాలి.
-పాతూరి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, వెల్దండ, నర్మెట మండలం
కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కష్టాలే
స్టేషన్ ఘన్పూర్ : నేను 2019లో ఏపీజీవీబీలో రూ. 80 వేలు, ఇప్పగూడెం ఐసీఐసీఐ బ్యాంకులో నా భార్య కవిత పేరుపై రూ. 1.80 లక్షలు అప్పు తీసుకున్న. ప్రతి ఆరు నెలలకు మిత్తి కట్టిన. కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తుందని మిత్తి కట్టడం మానేసిన. రూ. 2 లక్షలకు పైగా అప్పు ఉందని నాకు రుణమాఫీ జరగలేదు. మిత్తి అయినా కట్టు లేదా లోన్ క్లియర్ చేయమంటూ ఐసీఐసీఐ బ్యాంకు వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతుండ్లు. వడ్లు అమ్మిన పైసలు బ్యాంకులో పడగానే మిత్తి కట్ చేసుకుని ఇస్తామంటున్నారు. ఇంకోదిక్కు పూర్తిగా రుణమాఫీ జరిగిందని సీఎం చెప్తున్నడు. మా గ్రామంలో మాఫీ కాని రైతులు చాలామంది ఉన్నరు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కష్టాలే తప్ప లాభం లేదు.
– కత్తుల రాజు, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం
రూ. 1.50 లక్షల రుణం మాఫీ కాలే..
పరకాల : నాకు మొగుళ్లపల్లిలోని ఎస్బీఐలో రూ. 1.53 లక్షల లోన్ ఉన్నది. లెక్కకయితే నాడు మూడో విడుతలో రుణమాఫీ కావాలే. కానీ, బ్యాంకు అధికారుల తప్పిదంతో అది పూర్తి కాలేదు. అప్పుడు బ్యాంకుకు వెళ్తే నీ ఆధార్ మరొకరికి లింక్ కావడంతో రూ. 2 లక్షలకుపైన లోన్ చూపిస్తుంది, అందుకే మాఫీ కాలేదని చెప్పిండ్రు. తప్పులను సరి చేస్తం.. నీకు తర్వాత మాఫీ జరుగుతదని అన్నరు. కానీ ఇప్పుడు చేసిన రుణమాఫీలో కూడా నా పేరు లేదని అంటున్నరు. నా లోన్ ఎందుకు మాఫీ కాలేదో అర్థమైతలేదు. వ్యవసాయ, బ్యాంకు అధికారుల వద్ద సమాచారం లేదు. ఎవరి వద్దకు వెళ్లినా మాకు తెల్వదంటున్నరు. సీఎం, మంత్రులేమో రుణమాఫీ ఐపోయిందంటున్నరు. అసలు రుణమాఫీ ఐతదా? కాదా? తెలుస్తలేదు.
– ఆకుల సంపత్, మెట్పల్లి, మొగుళ్లపల్లి మండలం