హనుమకొండ చౌరస్తా : రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు( Students Suicides) ప్రభుత్వ హత్యలేనని ఏబీవీపీ( ABVP ) రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ( Rambabu ) ఆరోపించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత ఆలోచనలతో తెలంగాణ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుంని పేర్కొన్నారు.
పేద , బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు ( Welfare Hostels ) నరకకూపాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యకు 14 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణలో కేవలం 7 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పయిజన్ బారినపడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఇంతవరకు వర్సిటీకి పాలకమండలి లేక, బోధన, బోధనేతర పోస్టులు లేక పరిశోధనకు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. రేవంత్రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో గారడి మాటలు చెప్పి రైతులను రుణమాఫీ పేరుమీద మోసం చేసిందని ఆరోపించారు. సమావేశంలో హాస్టల్స్ కన్వీనర్ వెలుతుల రాజకుమార్, వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్, జిల్లా కన్వీనర్ హరిచరణ్, శ్రీనివాస్, శివ, శ్రీశాంత్, త్రినీష్, రాజకుమార్, సిద్ధార్థ, రాకేష్ పాల్గొన్నారు.