కాజీపేట, నవంబర్ 19 : రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చీఫ్ విప్, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 61వ డివిజన్ బాబుక్యాంప్‌లోని ఎక్లేషియా మినిస్ట్రీస్ చర్చిలో ఆదివారం ఆయన క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల్లో దాస్యం గెలువాలని బిషప్ డానియల్ కల్యాణపు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వమత సమానత్వాన్ని కొనసాగిస్తున్నదన్నారు. రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిబింబించేలా గంగా, జమునా, తెహజీబ్‌ను మరోమారు సీఎం కేసీఆర్ ప్రపంచానికి చాటారన్నారు. క్రిస్టియన్ మైనార్టీలకు బ్యాంక్ లింకేజీ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించిందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. మైనార్టీలందరు బీఆర్ఎస్ వెంటనే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎలకంటి రాములు, డివిజన్ అధ్యక్షుడు కోటిలింగం, నాయకులు నార్లగిరి రమేశ్, శ్యాం, సాంబయ్య, చర్చి కమిటీ సభ్యులు కందుకూరి సారయ్య, లింగమూర్తి, రాజు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుకున్నామని దాస్యం అన్నారు. కార్తీక మాసం సందర్భంగా వీరశైవ లింగాయత్ కులస్తుల సామూహిక వన భోజనం, ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వర జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, హైదరాబాద్ కోకాపేటలో బసవేశ్వర భవన్ మంజూరు చేశారని తెలిపారు. తన సీడీఎస్ నుంచి బసవేశ్వర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు వినయ్భాసర్కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాన్నం రాజయ్య, మొగిళి, ఈశ్వరయ్య, సర్వేశ్వర్, వీరేశం, గౌరీశంకర్, కోటేశ్వర్ పాల్గొన్నారు. అలాగే చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ నగరానికి విచ్చేసిన త్రిదండి అహోబిలం రామానుజజీయర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.
హనుమకొండ చౌరస్తా : మార్వాడీల సొసైటీకి ప్రభుత్వం అండగా నిలుస్తోందని దాస్యం అన్నారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా రామ్ మందిర్‌లో జరిగిన కార్యక్రయంలో ఆయన మాట్లాడుతూ.. ట్రైసిటీలో చాలామంది మార్వాడీలు స్థిరపడ్డారని, వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. కాగా, వినయ్‌భాస్కర్‌కు మార్వాడీలు మద్దతు ప్రకటించారు.
హనుమకొండ చౌరస్తా : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో 29వ డివిజన్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు దత్తు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లోని అన్ని కమిటీల్లో ఇప్పుడు చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, నాయకులు ముత్యాల మహేందర్ పాల్గొనగా ప్రసాద్, శేషు, కిశోర్, కృష్ణ, దిలీప్ కుమార్, రాజుతో పాటు 50 మంది పార్టీలో చేరారు.