ఐనవోలు : అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ఐనవోలు అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ లిస్ట్ లిస్టులో నిరుపేదల కాకుండా 50% పైగా అనర్హులకు, కాంగ్రెస్ నాయకుల పేర్లు వెరిఫికేషన్ లిస్టులో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు, అర్హులైన లబ్ధిదారులు సమావేశం అయ్యారు. ఈ మేరకు గ్రామపంచాయతీ సెక్రటరీ లేకపోవడంతో కారోబార్ఖు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పూర్తిగా ఇల్లు లేకుండా కిరాయిలకు ఉంటూ ఉంటున్న వారిని వదిలేసి ఇందిరమ్మ కమిటీ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడాన్ని వ్యతిరేకించారు.
ప్రభుత్వం ఒకపక్క ఇల్లులేని పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని చెప్తుంటే ఐనవోలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాత్రం అవేమి పట్టవు అన్నట్టుగా వ్యవహరించారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కల్పించుకొని రీసర్వే చేయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేంతవరకు అఖిలపక్ష నాయకుల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ అఖిలపక్ష సమావేశానికి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హాజరవడం గమనార్హం. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల కుమార్, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశి, తీగల లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ యూత్ నాయకుడు దిలీప్, కుమార్, ప్రశాంత్, ఏలియా, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజు, బిజెపి నాయకులు మహేష్ గౌడ్, కోటేశ్వర్, పులి సాగర్, బీఎస్పీ మండల నాయకులు సామ్యూల్, సందీప్, డి.ఎస్.పి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.