ములుగు, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో ఈనెలాఖరు నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, పౌర సరఫరాలశాఖ అధికారులు శుక్రవారం రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీసుకువచ్చే వడ్లకు కావాల్సిన గన్నీ బ్యాగులను సిద్ధం చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమచేసే ఏర్పాట్లు చేశారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.
అంచనా మెట్రిక్ టన్నులు
జిల్లాలో సాగునీటి సౌకర్యం ఉన్నందున యాసంగి సీజన్లో రైతులు అధిక విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. సుమారు 50వేల ఎకరాల్లో వరి వేయగా, 90వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 150 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 27, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 100, ఐటీడీఏ ఆధ్వర్యంలో 21, జీసీసీల, ఎఫ్‌బీవోల ద్వారా మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు అనుమతులు పొందారు.
సిద్ధంగా గన్నీ బ్యాగులు
ధాన్యం కొనుగోలుకు 10లక్షల గన్నీ సంచులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే పౌర సరఫరా శాఖల వద్ద 5లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా సంచుల సరఫరాకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించకుండా వాజేడు మండలం పేరూరు వద్ద ఇంటర్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. వడ్లను ములుగు తాలూకా లారీ అసోసియేషన్‌కు చెందిన లారీల ద్వారా జిల్లాలోని 31 రైస్ మిల్లులకు తరలించేందుకు సివిల్ సైప్లె శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వడ్ల కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనుగోళ్లు ప్రారంభిస్తాం
యాసంగిలో జిల్లాలో కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వడ్లను కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తరలించేందుకు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులను పూర్తిచేశాం. జిల్లాలో యాసంగి సీజన్లో పంట ఆలస్యంగా వచ్చే కారణంగా ఈ నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. వాటి ద్వారా వడ్ల కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం.
– రాములు, పౌరసరఫరాల శాఖ మేనేజర్, ములుగు జిల్లా
జయశంకర్ జిల్లాలో..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి వడ్ల జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గత ఏడాది కన్నా ఈసారి వరి ధాన్యం దిగుబడి పెరిగిందని అధికారులు జిల్లాలో సోమవారం రేగొండ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించనున్నారు.
జిల్లాలో 214 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని 11 మండలాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు 214 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 177, మహిళా సంఘాల ద్వారా 9, గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా 4, ఇతర కేంద్రాలు 14 ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,060, కామన్ రకం క్వింటాలుకు రూ.2,040 చొప్పున చేయనున్నారు. కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం సేకరణ, పరిశీలన కోసం జిల్లాలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వేరే రాష్ర్టాలు, జిల్లాల నుంచి జిల్లాకు ధాన్యం విక్రయించడానికి రాకుండా చెక్ పోస్టుల వద్ద సివిల్ సైప్లె అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. అవసరమైన 30లక్షల గన్నీ బ్యాగులు ఇప్పటికే జిల్లాకు చేరాయి.
అధికారులకు జేసీ ఆదేశాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు సేకరణపై జిల్లా సంయుక్త కలెక్టర్ స్వర్ణలత ఇప్పటికే సివిల్ సైప్లె, వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సివిల్ సైప్లె అధికారులు ఇప్పటికే రైతులు, మిల్లర్లకు ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు.
మౌలిక వసతులు కల్పిస్తాం
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేసవిని దృష్టిలో పెట్టుకొని కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు 30 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుతున్నాం. కలెక్టర్ భవేశ్ మిశ్రా, జేసీ స్వర్ణలత ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
– రాఘవేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్