భీమదేవరపల్లి, మే 21: రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి తెలిపారు. బుధవారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు భూసారాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. పంటలపై యూరియాను అధికంగా వినియోగించితే పెను ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు.
ప్రతి రైతు సాధ్యమైనంతవరకు యూరియాను పంటలపై తక్కువగా వినియోగించాలని తెలిపారు.
పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజలు వేసినట్లయితే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. తొలకరి వర్షాలకు జీలుగా, జనుము, పెసరు, తదితర వాటిని నాటి 45 రోజుల తర్వాత భూమిని దున్నాలన్నారు అనంతరం వరి వంటి పంటలు వేసినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, మండల వ్యవసాయ అధికారిని పద్మ, ఏఈఓలు కమల్ హాసన్, రవితేజ, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.