నర్సింహులపేట, జనవరి 17 : ఉపాధిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన వ్యవసాయ కూలీలకు ఇక్కడ చేతినిండా పనిదొరుకుతున్నది. జూన్ నెలలో వచ్చి 8నెలల పాటు ఇక్కడే ఉండి పనులు చూసుకొని మళ్లీ మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ స్వస్థలాలకు వెళ్తారు. ఈ సారి వానలు పుష్కలంగా కురవడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవడం.. బావులు, బోర్లలో నీటి లభ్యత ఉండడంతో ఎక్కడ చూసినా పచ్చని పైర్లే కనిపిస్తున్నాయి.
రైతులు కూడా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నాటు పనులు, మిరప కాయలు ఏర డం తదితర పనుల్లో అన్నదాతలు, వ్యవసాయ కూలీ లు బిజీబిజీగా ఉన్నారు. అయితే, వ్యవసాయ పనులకు మంచి సీజన్ కావడంతో కూలీలకు కొరత ఏర్పడింది. ప్రస్తుతం యాసంగి నాటు వేసేందుకు ఎకరానికి రూ.5వేల నుండి రూ.6వేలు, మిరప ఏరేందుకు రోజు కూలీ రూ.300లతోపాటు కూలీలను వాహనా ల్లో తీసుకొచ్చే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. అదే సమయంలో కొందరు రైతులు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం ఇక్కడి వచ్చిన కూలీలపై ఆధారపడుతున్నారు.
నర్సింహులపేట మండలం రూప్లాతండా గ్రామ పంచాయతీకి చెందిన రైతులు జాటోత్ శ్రీను, సంతోష్ తమ మిరప పంట ఏరేందు కు మధ్యప్రదేశ్ కూలీలను ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడకు రప్పించారు. మన దగ్గరి కూలీలు రోజువారీగా పనులు చేస్తే.., వారు కిలోకు రూ.15చొప్పున కాయ లు ఏరుతున్నారు. దీంతో రైతుల పనులు కూడా చకచకా సాగిపోతున్నాయి. వీరు చెలుకల దగ్గరే గుడారాలు వేసుకొని ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 వరకు పనిచేస్తున్నారు. ఐదారు రోజుల్లో ఎకరం మిరప కాయలు ఏరుతున్నారని రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.