శాయంపేట ఫిబ్రవరి 5 : సబ్సిడీపై రైతులకు జీవ ఎరువులను(Bio-fertilizers) అందిస్తున్నట్లు శాయంపేట వ్యవసాయ విస్తరణ అధికారి అర్చన(AEO Archana) బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట పొలాల్లో వైరస్, తెగుళ్లు వస్తున్నందున రైతులు జీవ ఎరువులను వాడాలని సూచించారు. భూసార అభివృద్ధి, పంట పెరుగుదలకు కావలసిన పోషకాలు అందించడం కోసం భాస్వరాన్ని కరిగించే బయోఫర్టిలైజర్(జీవ ఎరువు) ఫాస్పేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా (పి ఎస్ బి)ని వ్యవసాయ శాఖ నుంచి సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఒక కిలో ప్యాకెట్ ధర బహిరంగ మార్కెట్లో 150 రూపాయల ఉంటుందని, కానీ సబ్సిడీపై కేవలం 20 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు.
పిఎస్ బి కావాల్సిన రైతులు పట్టాదారుపాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. పీఎస్బీ నేల సంరక్షణ, పంట పెరుగుదలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మజీవి అని తెలిపారు. ఇది భూమిలో ఉన్న భాస్వరం ఎరువుని సూక్ష్మ పోషకాలను అంటే మాంగనీస్ మెగ్నీషియం వంటి పోషకాలను మొక్కకు అందజేస్తుందని వివరించారు. మొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని, రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. రసాయనిక ఎరువులు అయిన యూరియా, డిఎపి, ఎంఓపి కాంప్లెక్స్ ఎరువులను జీవ ఎరువులతో కలిపి వాడకూడదని పేర్కొన్నారు. రెండు కిలోల పిఎస్బిని 100 కిలోల పశువుల పేడలో కలిపి పంట పొలాల్లో వేసుకోవాలి సూచించారు. ఈ అవకాశాన్ని రైతు సద్వినియోగం చేసుకోవాలని అర్చన కోరారు.