మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి/ములుగు (నమస్తే తెలంగాణ)/హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 22 : వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లపై సర్కారు కక్ష కట్టినట్లుగా స్పష్టమవుతున్నది. ఉమ్మడి వరంగల్‌లోని నాలుగు జిల్లాల్లో 15మంది ఏఈవోలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హనుమకొండ జిల్లా నుంచి ఐదుగురుండగా, కాజీపేట మండలంలో ఇద్దరు, శాయంపేటలో ఇద్దరు, ఐనవోలులో ఒక్కరున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు ఏఈవోలను సస్పండ్ చేయగా, మహదేవపూర్‌కు చెందిన ధర్మేందర్, కాటారం మండలంలోని చిదినెపల్లి క్లస్టర్‌కు చెందిన రాజన్న, చింతకానిలో దివ్యజ్యోతి, మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ) క్లస్టర్‌కు చెందిన శివకృష్ణ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఏఈవో అఖిల్ కుమార్, గార్ల నుంచి కిరణ్, పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి క్లస్టర్లో పనిచేసున్న యశస్వినిపై సస్పెన్షన్ వేటు పడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో బీ రాజు, వెంకటాపురం(నూగూరు)-1 ఏఈవో శ్యాంకుమార్, వాజేడు మండలంలోని పెద్దగొల్లగూడెం ఏఈవో రాధికను సస్పెండ్ చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీసీఎస్ (డిజిటల్ క్రాప్ సర్వే)ను ఎలాంటి సహాయకులు లేకుండా చేయాలని ఏఈవోలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నది. ఈ క్రమంలో రెండు నెలలుగా ఏఈవోల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేసి వినతిపత్రాలను అందించారు. ఇదేకాకుండా ఇటీవల హైదరాబాద్‌లో 2,500 మంది ఏఈవోలు ఆత్మీయ సమ్మేళనం పేరిట సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని డీసీఎస్ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని తీర్మానించుకున్నట్లు సమాచారం. ఇంటలిజెన్స్ వ్యవస్థ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో కొంతమందిపై చర్యలు తీసుకుంటే మిగతా వారు దారిలోకి వస్తారనే యోచనతో చిన్నచిన్న కారణాలు చూపి సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏఈవోలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏఈవోల సంఘంతో పాటు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు సైతం ప్రభుత్వ కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో సస్పెండ్ చేసిన ఏఈవోల కారణం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. చనిపోయిన రైతులకు రైతుబీమా ఇప్పించడంలో వీరు జాప్యం చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే వీరిపై సూపర్వైజింగ్ అధికారులైన ఏవోలు, ఏడీఏలు, డీఏవోలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఏఈవోల సంఘం మండిపడుతున్నది. చిన్నస్థాయి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేందుకే సర్కారు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.