గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించి చాలా మంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. వరంగల్ నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి స్మోకింగ్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. పోలీసులు ఎంత కట్టడి చేసినప్పటికీ ఆగడం లేదు. రోజుకు ఏదో ఒక చోట గంజాయి సేవించి పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అధునాతన పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మందుబాబులకు పరీక్షలు చేసినట్లుగానే ఇప్పుడు గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వారిని కనిపెట్టేందుకు ఏబాన్ కిట్లు వచ్చేశాయి.
– సుబేదారి, ఆగస్టు 25
గంజాయితోపాటు 12 రకాల మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులు ‘ఏబాన్’తో అడ్డంగా దొరికిపోతారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని యూరిన్ శాంపిల్స్‌తో ఈ మిషన్‌తో టెస్ట్ చేస్తారు. పాజిటివ్ సిగ్నల్ వస్తే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల (ఎన్డీపీఎస్) చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు. గంజాయి స్మోక్ చేసిన వ్యక్తుల బాడీలో ఆరు నెలల వరకు వాటి నమూనాలు ఉంటాయని, ఇది ఏబాన్ పరికరంతో బయట పడుతుందని ఇటీవలె హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు పది రోజుల క్రితం ఏబాన్ టెస్ట్ పరికరాలు వచ్చాయి. నగర పరిధిలోని పోలీస్స్టేషన్లకు రెండు నుంచి 3, గ్రామీణ ప్రాంతాల్లోని వాటికి ఒకటి నుంచి రెండు, ఎక్సైజ్ స్టేషన్‌కు ఒకటి చొప్పున వీటిని అందజేశారు. ఈ టెస్ట్‌లు చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ అధికారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభించడానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గంజాయి, మత్తు పదార్ధాల వాసన పసిగట్టడానికి కమిషనరేట్‌కు టీఎస్ న్యాబ్ నుంచి రెండు ప్రత్యేక డాగ్‌లు వచ్చాయి. ఈ టెస్ట్‌లతో గంజాయి స్మోకింగ్ నియంత్రణ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఎన్డీపీఎస్ యాక్ట్‌ను పక్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నాం. గంజాయి స్మోక్ చేసిన వారిని సులువుగా పట్టుకోవడానికి కొత్తగా ఏబాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేశాం. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పసిగట్టడానికి రెండు డాగ్‌లు కూడా వచ్చాయి. ఏబాన్ టెస్ట్‌లు చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ అధికారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఇది పూర్తయిన తర్వాత టెస్టులు నిర్వహించి, స్మోకింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– అంబర్ కిషోర్‌ఝా, వరంగల్ పోలీస్ కమిషనర్