హనుమకొండ, డిసెంబర్ 6 : ఏసీబీకి పట్టుబడిన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆయన పని చేసిన చోట, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టరగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చూసే శాఖలకు సంబంధించిన బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అదనపు కలెక్టర్‌కు అనుబంధంగా ఉన్న రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖల్లో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు పలువురు గతంలోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతున్నది.
ఏసీబీ అధికారులు సైతం గత కొన్ని రోజులుగా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిపై నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా అదనపు కలెక్టర్‌గా పలు భూములకు సంబంధించి రెవెన్యూ కోర్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అలాగే సివిల్ సప్లయ్ శాఖలో కొందరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులకు అండగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏ పనికైనా ఒక రేటు ఫిక్స్ చేసి, కింది స్థాయి సిబ్బంది సహకారంతో నడిపించేవాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా ధాన్యం కేటాయింపు విషయంలో కొందరు మిల్లర్లు సమీక్షల్లో అదనపు కలెక్టర్ వ్యవహారంపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజాగా, మూడు నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లతో జరిగిన సమీక్షలో కూడా రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సీరియస్ అయినట్లు ఆశాఖలో ప్రచారం జరుగుతున్నది. తాజాగా, ఏసీబీకి పట్టుబడంతో ఆయన బాధితులంతా రోడ్డెక్కడంతోపాటు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.
అయితే, రెవెన్యూ కోర్టులో,సివిల్ సప్లయ్ శాఖల్లో అవినీతి అక్రమాల విషయంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి ఆయా శాఖల్లో ఆయనకు అనుకూలంగా ఉన్నవారు.. సహకరిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, రైస్ మిల్లర్లుతోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా శనివారం గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులు శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని అదనపు కలెక్టర్‌కు వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పటాకులు కాల్చి సంబురాలు చేసుకోవడం విశేషం.