‘చట్టం అందరికీ సమానమే.. ఫిర్యాదుదారులు ఎలాంటి భయం లేకుండా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాలి.. ఇక్కడ వారికి న్యాయం జరుగుతుందనే భరోసా ఉండాలి. మెరుగైన శాంతిభద్రతలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది’ అన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందుకు పోతున్నది. కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలవుతున్నది. సొంత శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించిన ఆయన, ఎవరైనా సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరిపించి కొరడా ఝులిపిస్తున్నారు. ఆరు నెలల్లోనే దారితప్పిన 16మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు కూడా ఉన్నారు. ముఖ్యంగా భూ కబ్జారాయుళ్ల పాలిట సింహస్వప్నంలా నిలుస్తున్న రంగనాథ్, బాధితులకు న్యాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.
వరంగల్, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఫ్రెండ్లీ పోలీస్’ అంటే బాధితుల గోడు ఓపికగా వినడం, వారికి వేగంగా న్యాయం జరిగేలా చూడడం. మెరుగైన శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్న సర్కారు విధానానికి అనుగుణంగా వరంగల్ పోలీసు కమిషరేట్‌లో పరిపాలన కొనసాగుతున్నది. పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సిబ్బంది పనితీరులో పూర్తిస్థాయి మార్పు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బాధితులకు వేగంగా న్యాయం అందించడం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ఉన్నది.
భూ దందాలకు ఎక్కడిక్కడ బ్రేకులు పడ్డాయి. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసిన వారికి సహకరించే పోలీసు అధికారులపైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలీసుల పనితీరు మెరుగ్గా ఉండాలంటే ముందుగా సొంత శాఖలో అంతా సవ్యంగా ఉండాలనే విధానంతో సీపీ రంగనాథ్ పకడ్బందీగా ముందుకు పోతున్నారు. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 16 మందిపై వేటు పడింది. వీరిలో ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు కూడా ఉన్నారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవనే సీపీ హెచ్చరికలతో ఇప్పుడు ఆ శాఖలో సిబ్బంది పనితీరు మెరుగైంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధుల నిర్వహణ కనిపిస్తున్నది.
సొంత శాఖ ప్రక్షాళన..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హద్దులు దాటి వ్యహరిస్తున్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నది. విధి నిర్వహణలో దారితప్పి, సొంత ఎజెండాతో ముందుకెళ్లిన పలువురు సీఐలు, ఎస్ఐలపై వేటు పడడంతో కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు జాగ్రత్తగా పని చేస్తున్నారు. ఏవీ రంగనాథ్, వరంగల్ సీపీగా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలో ఏండ్ల నుంచి ఇక్కడే పనిచేస్తూ అక్రమార్కులకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అవినీతి, ఆరోపణలు వచ్చిన సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిపై డీసీపీ స్థాయి అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులతో వరంగల్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడి భూముల ధరలు బాగా పెరిగాయి. ఇదే అదనుగా కొందరు భూ కబ్జాలకు పాల్పడ్డారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో పోలీస్ కమిషనర్ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి విచారణ అనంతరం తగిన చర్యలు చేపట్టారు. కబ్జాదారులకు సహకరిస్తున్న పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచ్చన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణ కిడ్నాప్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బచ్చన్నపేట ఎస్ఐ నవీన్‌కుమార్‌ను మూడు రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులో పిటిషన్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు చేయకపోవడం, విధుల్లో అలసత్వంగా ఉంటుండడంతో ఎస్ఐ నవీన్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
భూ వివాదంలో బాధితుడిని బెదిరించినట్లు ఆరోపణలు రుజువు కావడంతో కేయూసీ ఇన్స్పెక్టర్ పత్తిపాక దయాకర్ ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. భీమారంలో రిటైర్డ్ టీచర్ తన ప్లాట్‌ను ఆక్రమించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా బాధితుడిని స్టేషన్‌కు తిప్పించుకోవడం, ప్లాట్‌ను కబ్జా చేసిన వారికి వంతపాడడంతో అతడు నేరుగా సీపీకి ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం దయాకర్‌ను సీపీ ఈనెల 10న సస్పెండ్ చేశారు.
భూ వివాదంలో బాధితులకు కాకుండా కబ్జా చేసిన వారికి మధ్యవర్తిగా సహకరించడం, మధ్యవర్తిగా వచ్చిన రౌడీషీటర్‌కు తుపాకీ నోట్లో పెట్టి బెదిరించిన ఆరోపణలపై హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ రావుల నరేందర్‌ను సీపీ రంగనాథ్ మే 19న సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలతోపాటు సీతంపేట శివారులో భూవివాదం కేసులో నరేందర్ జోక్యం చేసుకున్నాడు. రౌడీషీటర్ ద్వారా భూ ఆక్రమణదారుల నుంచి డబ్బు తీసుకున్నాడు. భూమి యజమానులు, రౌడీషీటర్ ఫిర్యాదు ఆధారంగా విచారణ అనంతరం నరేందర్‌పై వేటు వేశారు.
హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనఖీల పేరుతో వాహనదారుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. బ్రీత్ అనలైజర్ మిషన్‌తో రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో డబ్బులు తీసుకున్నాడు. ఈ ఆరోపణలు రుజువుకావడంతో సతీష్‌ను సీపీ సస్పెండ్ చేశారు.
మట్టెవాడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సీహెచ్ రమేశ్ భూ వివాదంలో బాధితులకు వ్యతిరేకంగా వ్యవహించి సస్పెండ్ అయ్యా డు. ములుగురోడ్డు సమీపంలోని దత్తాత్రేయకాలనీలో ఓ ప్లాట్ వివాదం విషయంలో కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇన్స్పెక్టర్ రమేశ్ వ్యవహరించాడు. కోర్టు తీర్పును అమలు చేయాలని బా ధితులు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్ట ర్ రమేశ్ బాధితులకు వ్యతిరేకంగా ఉన్న వారికి సహకరించాడు. బాధితులు సీపీకి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.
రేషన్ బియ్యం దందా చేస్తున్న వారి నుంచి డబ్బు తీసుకుని వారికి సహకరిస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో టా స్క్‌ఫోర్స్ విభాగం ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, సోమయ్యను వరంగల్ సీపీ సస్పెండ్ చేశారు.
లైంగిక వేధింపుల కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీ కుదుర్చుకోవాలని యువతిని బెదిరించిన ఆరోపణలు రుజువు కావడంతో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఎస్ఐ పున్నం చందర్‌ను సీపీ సస్పెండ్ చేశాడు. సదరు ఎస్ఐ ఈ కేసు విషయంలో రాజీప్రయత్నంగా చేయగా, బాధితురాలు న్యాయం కోసం సీపీకి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం పున్నం చందర్ సస్పెండ్ అయ్యాడు.
నర్సంపేట సబ్ డివిజన్ నల్లబెల్లి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రాజారాం ఆవినీతికి పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ అయ్యాడు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి నెలవారీగా డబ్బులు తీసుకోవడం, ఇటుక బట్టీల వారిని బెదిరించి డబ్బు వసూలుపై వచ్చిన పిటిషన్లపై విచారణ అనంతరం ఆరోపణలు రుజువుకావడంతో రాజారాం సస్పెండ్ అయ్యాడు. పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన కానిస్టేబుల్ స్వామి సైతం ఆవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు.
గీసుగొండ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియ అనైతిక చర్యలకు పాల్పడడంతో మహిళా ఎస్ఐ భర్త సీపీకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో వీరిద్దరి సస్పెన్షన్ తీవ్ర చర్చనీయాశమైంది.
నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగరాణి కొందరి నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడంతో బాధితుడు హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమెపై చీటింగ్ కేసు నమోదుకావడంతో సీపీ సస్పెండ్ చేశారు.
కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో దొంగ పరారైన కేసులో కానిస్టేబుల్, రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేసిన కానిస్టేబుల్ బీ వెంకటయ్యపైనా సీపీ సస్పెన్షన్ వేటు వేశారు.