జనగామ చౌరస్తా, నవంబర్ 16 : దోష నివారణ పూజలు చేస్తామని నమ్మించి రూ. 55 లక్షలు కొల్లగొట్టిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాముల ముత్తూట్ గోల్డ్ లోన్ ప్రతాలు, రెండు ల్యాండ్ డాక్యుమెంట్లు, ఒక ఎర్టిగా కారుతో కలిపి మొత్తంగా రూ. 34.36 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. శనివారం జనగమ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలు వెల్లడించారు.
ఆయన కథనం మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురంకు చెందిన ట్రాన్స్‌జెండర్ భట్టు నాగదేవి (నాగమణి), జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం ఏరియాకు చెందిన పాముకుంట్ల సందీప్, మెతుకు గణేశ్, ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి తండాకు చెందిన గుగులోత్ నవీన్, భాగ్యనగర్‌కు చెందిన భూక్యా గణేశ్ ముఠాగా ఏర్పడి దోష నివారణ పూజలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించడం అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో గత జూన్ 1న జనగామ జిల్లా కేంద్రంలోని వెంకన్నకుంటకు చెందిన సిరివెన్నెల తనకు పరిచమున్న మహిళలకు బాబు పుడితే చూడడానికి వెళ్లింది.
అక్కడ సిరివెన్నెలకు నాగదేవి పరిచయమై మీ ఇంట్లో దోషాన్ని పోగొడతానని మాయమాటలతో నమ్మించి, బాధితురాలితో పాటు ఆమె సోదరుడు నిఖిల్ ఇంట్లో పూజలు చేసి వారి నుంచి రూ.55 లక్షలతో పాటు రెండు ప్లాట్ల డాక్యుమెంట్లు తీసుకుంది. ఈ విషయమై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఎర్టిగా కారులో వెళ్తున్న ఐదుగురు ముఠా సభ్యులు కనిపించగా, అనుమానం వచ్చి వారిని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన అర్బన్ సీఐ దామోదర్‌రెడ్డితో పాటు సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పార్ధసారథి అభినందించారు.