ఆరుగాలం శ్రమించి సాగుచేసిన రైతులకు ఆ పంట ను అమ్ముకునేదాకా కష్టాలు తప్పడం లేదు. మొ న్నటిదాకా ఓ వైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన వడ్లు తడిసి ఆగమైన అన్నదాతకు ఇప్పుడు కొనుగోళ్లూ పెద్ద సమస్యగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో కాంటాలు కాక చాలామంది రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇటీవల కలెక్టర్ స్వ యంగా బయ్యారం, గార్ల, డోర్నకల్‌లోని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి త్వరగా ధాన్యం తరలించాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పు లేకపోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కొనుగోళ్లు పూర్తయినా ధాన్యం డబ్బులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
– మహబూబాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ)
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్వోలు ఇవ్వకపోవడంతో కాంటాలు కాక కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం స్వయంగా జిల్లా కలెక్టర్ బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, త్వరగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. అయినా కూడా పౌర సరఫరాల, సహకార శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల బయ్యారం, గార్ల మండలాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే అన్నట్లుంది పరిస్థితి. మిల్లుల్లో ధాన్యం పూర్తిగా నిండిపోవడంతో పెట్టేందుకు స్థలం లేక ఆర్వోలు ఇవ్వడం లేదు.
ఒక లారీ లోడు చేసుకొని పోతే మిల్లులో దించేందుకు మూడు నాలుగు రోజులు పడుతుంది. దీంతో రవాణా కాంట్రాక్టర్లు సైతం లారీలు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. ఇటు ధాన్యం కాంటాలు కాకపోవడంతో రైతులు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే తాము రోజుల తరబడి కేంద్రాల వద్ద ఉండాల్సి వస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మిగిలిన మండలాల్లో ఈ సమస్య కాస్త ఊరటనిచ్చినా, చివరికి వరి కోతలు వచ్చే గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది.
కొంతమంది రైతుల ధాన్యం కళ్లంలోనే ఉండగా, మరికొంత మంది రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతోంది. దీనికి తోడు ఇటీవల రెండు రోజులు వర్షాలు పడడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలామంది రైతుల ధాన్యం తడవడంతో వారు తిరిగి ఆ ధాన్యాన్ని ఆరబెట్టి మళ్లీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు చేతులెత్తేశారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29,026 మంది రైతుల నుంచి రూ.309.99 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటివరకు 20,223 మంది రైతులకు రూ.213.64 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 8,803 మంది రైతులకు సంబంధించి రూ.96.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకో రైతు ధాన్యం అమ్మిన తర్వాత వారి ఖాతాలో డబ్బులు పడాలి అంటే పది నుంచి 15 రోజులు పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వెనువెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులకు కోరుతున్నారు.
నాకున్న మూడు ఎకరాలతో పాటు 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసి న. ప్రభుత్వం కింటాకు రూ.500 బోనస్ ఇ స్తామంటే ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ డ్లు పోస్తే 20 రోజుల తర్వాత కాంటా పెట్టా రు. కాంటా పెట్టి 18 రోజులైనా పైసలు ఇయ్యలే. 15 ఎకరాల్లో 563 బస్తాలకు 225 క్వింటాళ్ల వడ్లకు రావాల్సిన పైసలు బ్యాంకులో ఏయలే.
– మంద వీరన్న, రైతు, నర్సింహులపేట
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 25 రోజుల క్రితం 273 బస్తాలు, 110 క్వింటాళ్ల కాంటాలో పెట్టారు. 15 రోజుల తర్వాత ధాన్యం డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు బోనస్ పడలేదు. సుమారు 55వేల రూపాయల బోనస్ రావాల్సి ఉంది.
– మహిపాల్‌రెడ్డి, రైతు, రామంజపురం