కరీమాబాద్, జనవరి 3 : సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. శుక్రవారం మామునూరులోని 4వ బెటాలియన్‌లో కమాండెంట్ రామ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌జోషి మాట్లాడుతూ ప్రజలకు రక్షణగా నిలుస్తూ మెరుగైన సేవలను అందిస్తూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.
ఆటుపోట్లను అధిగమించి ఉద్యోగాలను పొందడం హర్షణీయమన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. 453 మంది తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందడం అభినందనీయమన్నారు.
పాసింగ్ అవుట్ పరేడ్‌కు రావడం సంతోషంగా ఉన్నదన్న ఆయన విధుల్లో రాణించి పోలీసు శాఖకు, ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తమ బిడ్డలను ఖాకీ దుస్తుల్లో చూసి అక్కడకు వచ్చిన తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా, పీటీసీ ప్రిన్సిపల్ పూజ పాల్గొన్నారు.