ఖిలావరంగల్, డిసెంబర్ 10 : ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ట్రస్టు పేరుతో ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడుతున్నది. వరంగల్ నగరంలోని శివనగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ట్రస్టుకు 50 శాతం ఇస్తే పిల్లల స్కూల్ ఫీజు 100 శాతం చెల్లిస్తామని, డబ్బులు డబుల్ ఇస్తామని, సగం ధరకే కుట్టు మిషన్లు అందజేస్తామని ప్రజలను నమ్మించిన నిర్వాహకులు తిరిగి చెల్లించకుండా తమ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం రోడ్డులో అభయ ఫౌండేషన్ పేరిట భవనాన్ని అద్దెకు తీసుకున్న నిర్వాహకులు కొంత మంది మహిళలను నియమించుకొని అమాయకులకు ఎరవేసే పనిలో నిమగ్నమయ్యారు.
తొలుత డబ్బులిచ్చిన కొంతమందికి కుట్టు మిషన్లు అందించడంతో నమ్మిన ప్రజలు ట్రస్టుకు భారీగా డబ్బులు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా నిర్వాహకులు తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు రోజూ కార్యాలయానికి వచ్చి పోతున్నారు. కాగా, ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ఆశ పడి అభయ ఫౌండేషన్ ట్రస్టుకు బియ్యం సరఫరా చేశారు. మొదటి నెల సరిపడా డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తిప్పించుకుంటున్నట్లు బాధితుడు ఆరోపించారు.
పలుమార్లు ఆఫీసుకు వెళ్లడంతో చెల్లని చెక్కులు ఇచ్చినట్లు తెలిపాడు. దీనికి తోడు స్కూలు ఫీజు, కుట్టు మిషన్లు ఇవ్వకపోవడంతో కొంతమంది కార్యాలయం వద్దకు వెళ్లి గొడవకు దిగుతున్నారు. దీంతో వస్తువులు, డబ్బులు వచ్చే నెలలో ఇస్తామని, అప్పటి వరకు ఎవరూ కార్యాలయానికి రావొద్దని నోటీసు బోర్డులో అతికించారు. అయితే ఆ లోపే బోర్డు తిప్పేస్తారేమోననే అనుమానాన్ని కొంతమంది బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రస్టు పేరుతో మోసం చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.