నర్సంపేట రూరల్, నవంబర్ 5: విద్యార్థిని కష్టపడి చదివి జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నిట్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకున్నా పేదరికం వెక్కిరిస్తోంది. ప్రయాణ, హాస్టల్, కౌన్సెలింగ్ తదితర తలకు మించిన భారంగా మారనున్నాయి. ఆర్థిక చేయూతనందించి ఆదుకోవాలని వేడుకుంటున్నది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్ తండాకు చెందిన అజ్మీరా రాజు-మమత దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు శిరీష ప్రాథమిక విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. తండాలో కూలీ పనులు దొరక్కపోవడంతో ఐదేళ్ల క్రితం ఆ కుటుంబం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. తండ్రి రాజు హమాలీగా, తల్లి మమత ఇండ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కుమారుడు చదువు మానేసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన శిరీష కష్టపడి చదివింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలులోని టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్లో పదో తరగతి, అదే కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. జేఈఈ మెయిన్స్‌లో 79 వేల ర్యాంక్‌తో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బీటెక్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల శ్రీనగర్ వెళ్లి చదవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. హాస్టల్, ప్రయా ణ ఖర్చులు, ల్యాప్‌టాప్, కౌన్సెలింగ్, ఇతరత్రా ఫీజులు కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది. సంవత్సరానికి దాదాపు రూ.2లక్షల చొప్పున నాలుగేళ్లకు రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని, తమ ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని శిరీష ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నది. సెల్ నంబర్ 9701305258కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని శిరీష, ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.