సుబేదారి, అక్టోబర్ 7 : మావోయిస్టు పార్టీ దండకారణ్యం సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ మంద రూబెన్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన మంద రూబెన్ అలియాస్ కన్నన్న, మంగన్న, సురేశ్ 1979లో వరంగల్ ఎన్ఐటీ హాస్టల్ మెస్‌లో పనిచేస్తూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాలకు ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మృతుడు నంబాల కేశవరావు పిలుపుతో మావోయిస్టు పార్టీలో చేరాడు.
1986 వరకు రూబెన్ నేషనల్ పార్క్ దళం, కుంట దళలో సభ్యుడిగా పనిచేశాడు. కొద్దికాలం దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ పీఎల్జీఏ బెటాలియన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ దళాలకు షెల్టర్స్, భోజనం సదుపాయాలు కల్పించాడు. ప్రస్తుతం సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయిలో రూబెన్ పనిచేస్తుండగా, అతడిపై రూ.8లక్షల రివార్డు ఉన్నదని సీపీ తెలిపారు. ప్రజా సంఘాల ముసుగులో కొంతమంది శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని, వారిపై పోలీస్ నిఘా ఉంటుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి మావోయిస్టు పార్టీలో 12 మంది ఉన్నారని, వారి పేర్లను వెల్లడించారు.
లింగాలఘన్పూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పానుగంటి శారద కమాండ ర్, రఘునాథపల్లి మండలం బాంజీపేటకు చెందిన కందగడ్డ రాజేశ్వర్ అలియాస్ భాస్కర్ డివిజన్ కమిటీ సభ్యుడు, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పల్లగుట్టకు చెందిన పవనానందరెడ్డి ఏసీఎం మెంబర్, ఇదే గ్రామం నుంచి కన్నెబోయిన మల్లయ్య అలియాస్ గంగన్న డీసీఎం, రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఉల్లంగుల యాకయ్య అలియాస్ అంజన్న డివిజన్ కమిటీ సభ్యుడు, కాజీపేట మండలం సోమడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మడికొండకు చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, సుదర్శన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన కందకట్ల యాదగిరి అలియాస్ వేణు, ధర్మసాగర్ మండలం తాటియాలకు చెందిన ఎర్ర రాజు అలియాస్ చందర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, పెద్దపెండ్యాలకు చెందిన మునిగాల చిన్న రవి అలియాస్ మల్లేశం డివిజన్ కమిటీ సభ్యుడు, వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన పోలేపాక సునీల్ ఆలియాస్ సుధీర్ డివిజన్ కమిటీ సభ్యుడు, కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన కనగంటి రాజనీకర్రెడ్డి దళ సభ్యుడు ఉన్నారు.