ఒకనాడు బత్తాయి తోటలతో కళకళలాడిన ఆ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నది. సరైన సాగునీటి వసతి కల్పించక పోవడంతో భూగర్భజలాలు పడిపోయి కరువు ప్రాంతంగా మారింది. కనీసం మెట్ట పంటలూ పండక, ఎటు చూసినా కరువు ఛాయలే కనిపించేవి. 1996 నుంచి 2014 వరకు దయనీయ పరిస్థితిని అనుభవించిన ఈ ప్రాంతంలో 25 ఏండ్ల క్రితం నుంచి బత్తాయి తోటలు పూర్తిగా ఎండిపోతూ వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో చాలామంది చెట్లను నరికి వేయాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో ఇక్కడి చెరువులన్నీ బాగయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల ఉచిత కరంటు.. ఇప్పుడా ప్రాంతాన్ని పూర్తిగా మార్చివేశాయి. అన్ని అనుకూలతలు ఉండడంతో మళ్లీ ఇక్కడి రైతుల్లో బత్తాయి సాగుపై ఆశలు చిగురించాయి. వారి ఆకాంక్షను గుర్తించిన ఓ ఇంటర్నేషనల్ కంపెనీ కొత్త రకం బత్తాయి (బ్రెజిలియన్) సాగు చేసేలా ప్రోత్సహించింది. 2019లో మొదటి దశ 74 ఎకరాల్లో మొక్కలు నాటగా, ఇప్పుడు అక్కడ 300 ఎకరాల్లో తోటలు విస్తరించాయి.
వరంగల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భీమదేవరపల్లి మండలం.. 40 ఏండ్ల క్రితం వరకు ఇది ఆహ్లాదకరమైన ప్రాంతం. ఇక్కడ అన్ని పంటలూ బాగా పండేవి. ముఖ్యంగా ఈ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రత్యేకం. రైతులు, కూలీలు, వ్యాపారులకు బత్తాయి మంచి ఆదాయ వనరుగా ఉండేది. ప్రతి సీజన్లో బత్తాయి కాయలు తెంపే కూలీలు, ఎగుమతులు చేసే వ్యాపారులు, లోడ్ తీసుకెళ్లే వాహనాలతో ఈ ప్రాంతమంతా సందడిగా ఉండేది. ఇక్కడ పండిన బత్తాయి మంచి రుచిగా ఉండడంతో అనేక రాష్ర్టాల్లో డిమాండ్ ఉండేది. తర్వాత కాలం మారుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం దుర్భిక్షంగా మారింది. భూగర్భ జలాలు పడిపోయి సాగునీటి ప్రాజెక్టులు లేక భీమదేవరపల్లి పాత కరీంనగర్ జిల్లాలో కరువు ప్రాంతంగా మారింది. 1996 నుంచి 2014 వరకు కరువుతో ఈ ప్రాంతం ఇంకా దయనీయంగా మారింది. 25 ఏండ్ల క్రితం నుంచే ఇక్కడి బత్తాయి తోటలు ఎండిపోతూ వచ్చాయి. కొందరు రైతులు కష్టపడి బిందెలతో నీళ్లు తెచ్చి పోసి చెట్లను బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. కొందరు రైతులు తప్పని పరిస్థితుల్లో చెట్లను నరికి వేయాల్సిన దుస్థితి వచ్చింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడ పరిస్థితి మారుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో ఈ ప్రాంతంలోని చెరువులు బాగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు, సాగుకు నిరంతర ఉచిత కరంటు భీమదేవరపల్లి ప్రాంతాన్ని పూర్తిగా మార్చి వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుతో పూర్తి స్థాయిలో సాగునీటిని అందుబాటులోకి తెచ్చింది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి భీమదేవరపల్లి మండలంలోని గ్రామాలకు నిరంతరం సాగునీరు అందుతున్నది. భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. బత్తాయి సాగుకు దూరమయ్యామని ఇక్కడి రైతుల్లో ఎన్నో ఏండ్లుగా ఉన్న ఆవేదనకు ముగింపు వచ్చింది. ఇక్కడి రైతుల ఆకాంక్షను గుర్తించిన ఇరిగేషన్ కంపెనీ, ‘జైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ వారిని సంప్రదించింది. తాము రూపొందించిన కొత్త రకం బత్తాయి (బ్రెజిలియన్) సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. మహారాష్ట్రలోని జలగాం ప్రాంతంలో సాగవుతున్న బ్రెజిలియన్ బత్తాయి తోటలకు ఇక్కడి రైతులను తీసుకెళ్లి చూపించింది. దీంతో రైతులు కొత్తరకం బత్తాయి తోటల సాగుకు ముందుకువచ్చారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకంలో రైతులకు డ్రిప్ సౌకర్యం కల్పించారు. మూడేండ్లపాటు నిర్వహణ ఖర్చులు చెల్లించే ఏర్పాట్లు చేశారు. మొక్కల కొనుగోలుకు ముల్కనూరు సహకార సంఘం ముందుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో మొదటి దశలో 74 ఎకరాల్లో మొక్కలు నాటారు. దశల వారీగా ఇప్పుడు 300 ఎకరాలకు సాగు పెరిగింది. మొదటి దశలో వేసిన పంట చేతికి వచ్చింది. భారీ స్థాయిలో బత్తాయి ఉత్పత్తి కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఇదే మండలంలో ఏర్పాటవుతున్నది. ఇక్కడి బత్తాయి రైతులకు ఈ ప్రాజెక్టుతో మేలు జరుగనున్నది. బత్తాయి సాగులో భీమదేవరపల్లి రైతుల స్ఫూర్తితో సమీపంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, సైదాపూర్ మండలాల రైతులు ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు. సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో భీమరదేవపల్లి ప్రాంతం మళ్లీ బత్తాయి తోటల ప్రాంతంగా నిలబడింది.
మేము రెండున్నరేండ్ల కింద మూడెకరాల్లో బ్రెజిలియన్ బత్తాయి మొక్కలు నాటినం. గతేడాది కాపు వచ్చింది. మొక్కల ఎదుగుదల ఆగుతదని పిందెలు తెంపినం. ఇప్పుడు మంచి కాత వచ్చింది. మొక్కల డబ్బు కోసం ముల్కనూరు బ్యాంకు నుంచి లోను తీసుకున్న. తోట నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నది.
– ముచ్చె పుల్లా రెడ్డి, రైతు, జీల్గుల, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా
మా ప్రాంతంలో ఇరవై ఏండ్ల క్రితం వరకు పెద్ద ఎత్తున బత్తాయి తోటలు ఉండేవి. పూర్తి మెట్ట ప్రాంతమైన మా రైతులకు బత్తాయి తోటలతోనే లాభాలు వచ్చేవి. మాకు సొంతంగా 25 ఎకరాల వరకు బత్తాయి తోట ఉండేది. నీరు లేక ఎండు తెగులు వచ్చి వాటిని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బ్రెజిలియన్ బత్తాయి నాటినం. ఎంత మంది రైతులు ముందుకు వస్తే అంతమందికి మొక్కలు కొనుక్కునేందుకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
– మార్పాటి రాంరెడ్డి, జీఎం, ముల్కనూరు సహకార బ్యాంకు
ముల్కనూరు సహకార బ్యాంకు పరిధిలోని గ్రామాల్లో రైతులు బ్రెజిలియన్ బత్తాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. బత్తాయి తోటల విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. మొక్కలు ఏపుగా పెరిగేందుకు మా సిబ్బంది ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటున్నారు. తరచుగా తోటలను పరిశీలిస్తూ కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి