కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలన గాడిలో పడుతుందా? వర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్చార్జిల తీరుతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డిని కేయూ వీసీగా నియమించింది. ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టగా.. సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న యూనివర్సిటీని సక్రమ మార్గంలో నడిపిస్తారా? అవినీతి, అక్రమాలతో వచ్చిన అపకీర్తిని తొలగించి పూర్వవైభవం తీసుకొస్తారా? లేక పాత సమస్యలే కొత్త వీసీకి తలనొప్పిగా మారతాయా? అనే అనుమానాలుండగా.. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆసక్తి అందరిలో నెలకొంది.
– హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 29
కాకతీయ యూనివర్సిటీకి ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) రూ. 45.50 కోట్లు విడుదల చేసింది. ఇందులో వివిధ విభాగాల్లో పరిశోధనా ప్రాజెక్టుల కోసం రూ. 8 కోట్లకుపైగా, మిగతా రూ. 37 కోట్లు కే-హబ్‌లో సదుపాయాల కోసం కేటాయించాల్సి ఉంది. అయితే రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వీటి సర్దుబాటు జరగలేదు. అయినప్పటికీ ముగ్గురు మంత్రులు హడావుడిగా వచ్చి కే-హబ్‌ను ప్రారంభించినప్పటికీ అది విద్యార్థులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి తోడు 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతుల అంశం పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల హైకోర్టు కూడా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరికి ప్రమోషన్లు కల్పించాలా? లేదా? అనేది ప్రభుత్వం నిర్ణయించే వరకు వేచి చూడాలా? అనే సందిగ్ధత నెలకొంది. ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి సైతం పదోన్నతులు కల్పించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే మాజీ వీసీ రమేశ్ ఆ ఆదేశాలను బేఖాతరు చేసి వారి దరఖాస్తులను పకనపెట్టారు. వాటిని మళ్లీ రివ్యూ చేసి పాలక మండలిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇన్చార్జి వీసీగా వాకాటి కరుణ బాధ్యతలు చేపట్టిన అనంతరం అకుట్ అభ్యర్థన మేరకు వివిధ గ్రేడుల్లోని అధ్యాపకులకు పదోన్నతులు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు నెలలు గడిచినా దరఖాస్తుల స్క్రూటినీ జరగలేదు. అలాగే బ్యాక్లాగ్ పోస్టుల్లో చేరిన నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాజీ వీసీ రమేశ్ హయాంలో అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన పట్టించుకోలేదు. వాకాటి కరుణ వచ్చాక వీరికి లైన్ క్లియరైంది. పాలక మండలిలో వీరి సర్వీసును క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం వీరు ఇటీవల అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని స్క్రూటినీ చేసి మొదట అసోసియేట్, ఆ పిదప ప్రొఫెసర్ పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అలాగే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన వారి ఏరియర్స్ చెల్లింపుల్లో రెండేళ్లుగా జాప్యం జరుగుతున్నది. అయితే ఇన్‌కంటాక్స్ మాత్రం కట్టాల్సి వస్తున్నది. మొత్తం 50 మందికి ఏరియర్స్ చివరి వాయిదా చెల్లింపు మిగిలి ఉంది. దీనికి తోడు కేయూ భూముల రక్షణ కోసం రూ. 10 కోట్లతో నిర్మించాల్సిన ప్రహరీ పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే దాదాపు 51 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. ఇటీవల హద్దుల నిర్ణయానికి చేపట్టిన సర్వే ఆగిపోయింది. అది పూర్తయితేనే ప్రహరీ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీలో రూ. 2.50 కోట్లతో చేపట్టిన బాలుర డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో కామన్ మెస్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలికల వసతి గృహాలతో పాటు డైనింగ్ హాల్ నిర్మాణం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.