హనుమకొండ(ఐనవోలు) : ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ( Collector Chahat Baj Pai ) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి ఐదో తరగతి విద్యార్థులకు గణిత ( Maths) పాఠ్యాంశాన్ని బోధించారు. ఒక చేత్తో గణిత పాఠ్యపుస్తకాన్ని కలెక్టర్ పట్టుకొని మరో చేతితో చాక్ పీస్ చేత పట్టి బ్లాక్‌బోర్డుపై స్వయంగా లెక్కలు రాసి విద్యార్థులతో గణితం లెక్కను సాధింపజేయడంతో పాటు వారి అవగాహన, ప్రతిభ, నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఉపాధ్యాయురాలుగా మారి పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన సాగించడం పాఠశాల ఉపాధ్యాయులకు సైతం స్ఫూర్తినిచ్చింది.
గణిత పాఠ్యాంశాన్ని సులువుగా అర్థమయ్యేట్టు బోధించడంతో పాఠశాల విద్యార్థులు సంబరపడ్డారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. ఆనందంతో మాట్లాడి విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థుల సంఖ్యను పెంచుకోవచ్చునని అన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వారి తల్లులను అడిగి తెలుసుకున్నారు.
వనమహోత్సవం సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, గ్రామపంచాయతీ కార్యాలయంలోని నర్సరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతకుంటపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంభూపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, తహసీల్దార్ విక్రమ్ కుమార్ , ఎంపీడీవో నర్మద, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.