ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్, గ్రానైట్ కంపెనీ లను మూసివేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నారాయణగిరి శివారులో ఉన్న నరసింహ స్వామి గుట్ట, మధ్యలోని బోడు, బొడగుట్ట ప్రాంతాలల్లో తెలంగాణ చారిత్రక ఆధారాలు, జైనుల, బుద్దుల ధ్యానం చేసిన ఆధారాలు, ఆనవాళ్లు, గుర్తులు, ఆ ప్రాంత పరిసరాల్లో ఓ శిలాశాసనం ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అలాగే ఇక్కడ అనుమతులకు మించి అక్రమ మైనింగ్, గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని, వీటి ద్వారా పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలగడమే కాకుండా, ఇక్కడ నుండి వెళ్లే భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసం అవుతూన్నాయని పేర్కొన్నారు. నిత్యం భారీ వాహనాల రాకపోకలతో ఇటు వాహనదారులు, అటు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో తెలిపారు. పురావస్తు శాఖ అధికారులు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన అంశాలను గుర్తించి కాపాడాలని, అలాగే మైనింగ్‌ను అరికట్టాలని కోరారు.