పచ్చని వనంపై గొడ్డలి వేటు పడింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో తీరొక్క మొక్కలు, ఆకట్టుకునే చెట్లతో గత బీఆర్ఎస్ సర్కారు నర్సంపేటలోని శాంతినగర్‌లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటుచేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నామరూపాల్లేకుండా చేస్తున్నది. ఎన్నో ఏండ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పూలు, పండ్ల మొక్కలు, 15 కానుగ, 123 టేకు చెట్లు కలిపి 300 చెట్లు సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అనాలోచిత నిర్ణయానికి నేలకొరిగాయి. ప్రకృతి వనాల అభివృద్ధికి గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తే రేవంత్ సర్కారు మాత్రం వాటిని నిర్దాక్షిణ్యంగా కొట్టేయడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఎలాంటి ప్రకటన గానీ, ఆన్లైన్ టెండర్ లేకుండానే వేలం వేసి వ్యాపారులతో నేలమట్టం చేయించి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసే నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
– నర్సంపేట, మార్చి 18
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పట్టణ ప్రకృతి వనాలను శ్రీకారంచుట్టింది. ఈ క్రమంలో నర్సంపేటలోని ద్వారకపేట-శాంతినగర్ 7వ వార్డులో పట్టణ ప్రకృతి వనం కోసం సర్వే నంబర్ 219లో 30గుంటల గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అప్పటికే 30 ఏళ్ల క్రితమే అందులో కొన్ని టేకు మొక్కలు నాటగా పెరిగి పెద్దవయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. పార్క్‌లో అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపర్చింది. ప్రతీ రోజు వందలాది మంది ఎంతోమంది ఈ వనంలో సేద తీరుతుంటారు.
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. అలాగే మొక్కల నిర్వహణ బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించగా సిబ్బంది వాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇలా గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలాలు అందే స్థాయికి వచ్చాయి. ఈ వనంలో టేకు, కానుగతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఎక్కువగా పెట్టగా 123 టేకు చెట్లు, 15 కానుగ చెట్లతో పాటు 30 ఏండ్ల నాటి చెట్లు అన్నీ కలిపి 300 దాకా ఉన్నాయి. ఏండ్ల తరబడి మున్సిపాలిటీ సిబ్బంది మొక్కలను పెంచి పెద్దచేశారు. వేసవి కాలంలో మొక్కలకు నీరందించేందుకు సిబ్బంది పడరాని పాట్లు పడ్డారు. అయితే గత ఐదు రోజులుగా ఈ చెట్లన్నింటినీ కొందరు వ్యాపారులు నరికి వేస్తుండడంతో ప్రకృతి వనం నామరూపాల్లేకుండా పోతున్నది.
విద్యుత్ సబ్ స్టేషన్ కోసమే!
ఇదిలా ఉండగా ఈ ప్రభుత్వ భూమిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అధికార పార్టీ ముఖ్య నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా జనావాసాల నడుమ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రమాదకరమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదం పంచే ప్రకృతి వనాన్ని తొలగించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే శాంతినగర్ ఫిల్టర్ బెడ్ సమీపంలో ప్రభుత్వ భూమి అనువుగా ఉన్నదని, అక్కడ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు.
పేపర్ ప్రకటన, ఆన్లైన్ టెండర్ లేకుండానే టేకు మొక్కల వేలం..
అధికారులు తూతూ మంత్రంగానే టేకు మొక్కల వేలం నిర్వహించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పేపర్ ప్రకటన చేయకుండా, ఆన్లైన్ టెండర్ లేకుండానే వేలం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మున్సిఫల్ కార్యాలయ తీర్మానంతో పాటు గిర్దావర్ పంచనామా రిపోర్టు ఆధారంగా కార్యాలయ నోటీస్ బోర్డుపై వేలం ప్రకటన ఉంచగా కార్యాలయ పని నిమిత్తం వచ్చిన ఒకరిద్దరితో వేలం ముగించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తహసీల్దార్ పేపర్ ప్రకటన చేసి టెండర్ నోటీసులు జారీ చేసి వ్యాపారులు పాల్గొనేలా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిడ్‌కు యాక్షన్ టెండర్ నిర్వహించాల్సి ఉంటుంది. యాక్షన్‌లో ఎక్కువ పాట పాడిన వ్యాపారికి అధికారులు టెండర్‌ను అప్పగిస్తారు. ఇవేమీ కాకుండానే మూడు శాఖల అధికారులు తమ నోటీస్‌బోర్డులపై టెండర్ విషయాలు పెట్టి అక్కడికి వచ్చిన ఒకరిద్దరితో గంపగుత్తగా వేలం పాట నిర్వహించడాన్ని పలువురు పట్టణ ప్రముఖులు అధికారుల పని తీరును తప్పు పడుతున్నారు. సుమారు రూ.5లక్షల పైగా రావాల్సిన టెండర్ వేలాన్ని లక్ష వరకే సరిపెట్టుకున్నారని పలువురు చెబుతున్నారు.
ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నాం
సర్వే నంబర్ 219లో 30గుంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నాం. ఈ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తాం. అన్ని అనుమతులు పద్ధతి ప్రకారమే తీసుకున్నాం. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు మున్సిపల్లో తీర్మానం జరిగింది. శాంతినగర్ ఫిల్టర్ బెడ్ సమీపంలోని స్థలం సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువుగా లేదనే, పట్టణ ప్రకృతి వన స్థలాన్ని ఎంపిక చేశాం.
– రాజేశ్, నర్సంపేట తహసీల్దార్