సుబేదారి, ఆగస్టు 2 : వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా 256 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, స్మగ్లర్లను అరెస్టు చేశారు. శనివారం హనుమకొండలోని కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తండాకు చెందిన బానోత్ బాబు కుమారస్వామి, నేరేడుపల్లి గ్రామానికి చెందిన నస్కరి కుమారస్వామి, మహబూబాబాద్‌కు చెందిన జలేందర్, భూపాలపల్లికి చెందిన అంగోత్ రాజేందర్‌తో పాటు పరారీలో ఉన్న ఏపీ తూర్పు గోదావరికి చెందిన ముకుంద్ ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌లోని డొంకవాయి మండలంలో తక్కువ ధరకు 256 కిలోల గంజాయి కొనుగోలు చేశారు.
రెండు కిలోల చొప్పున 128 ప్యాకెట్లలో సర్ది కారులో మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకు వస్తున్నారు. కాగా, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాన్ని ఆపి అందులో ఉన్న ఇద్దరు నిందితులు బానోత్ బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిని అరెస్టు చేసి, 256 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరార్ అయినట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐలు సార్ల రాజు, రమణమూర్తిని సీపీ అభినందించారు.