వరంగల్, జనవరి 24 (నమస్తేతెలంగాణ): జిల్లాలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నేత్ర శిబిరాలకు క్యూ కడుతున్నారు. మంగళవారం జిల్లాలోని 44 నేత్ర శిబిరాల్లో 6,497 మందికి కంటి పరీక్షలు చేశారు. అలంకానిపేట, ఇటికాలపల్లి, భాంజీపేట, జల్లి, ఉప్పరపల్లి, చెన్నారావుపేట, దుగ్గొండి, గీసుగొండ, వంచనగిరి, లక్ష్మీపూర్, ధర్మారావుపేట, ఖానాపురం, మేడపల్లి, నల్లబెల్లి, దీక్షకుంట, నెక్కొండ, కొంకపాక, పర్వతగిరి, చింతనెక్కొండ, ఊకల్, రాయపర్తి, తిర్మలాయపల్లి, చెన్నారం, సంగెం, గవిచర్ల గ్రామాలతో పాటు నర్సంపేటలోని 21వ వార్డు, వర్ధన్నపేటలోని 3వ వార్డు, వరంగల్ నగరంలోని 21, 35, 26, 36, 22, 12, 37, 39, 15, 19, 16, 17, 3, 42, 41, 32, 39వ వార్డులో కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మంగళవారం 6,497 మందికి నేత్ర పరీక్షలు జరిపినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో అత్యధికంగా వరంగల్లోని 16వ వార్డులోని శిబిరంలో 191 మందికి, ఆ తర్వాత ఇక్కడి 12వ వార్డు శిబిరంలో 189 మందికి కంటి పరీక్షలు జరిగాయి. సంగెం మండలం గవిచర్ల శిబిరంలో 186, నల్లబెల్లి మండలం మేడపల్లి శిబిరంలో 185, వరంగల్లోని 3వ వార్డు శిబిరంలో 170, గీసుగొండ నేత్ర శిబిరంలో 169 మందికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు జరిపారు. 44 నేత్ర శిబిరాల్లో సగటున ఒక్కో శిబిరంలో 144 మందికి పరీక్షలు చేస్తున్న జిల్లా ప్రోగ్రాం అధికారి గోపాల్రావు చెప్పారు.
సమన్వయంతో ముందుకు
జిల్లాలోని వివిధ కంటివెలుగు శిబిరాలను సందర్శించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కే వెంకటరమణ నేత్ర పరీక్షలు, మందులు, రీడింగ్ కళ్లద్దాల పంపిణీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేసుకుని మందులు, కళ్లద్దాలు పొందాలని ఆయన కోరారు. 44 నేత్ర శిబిరాల్లో తొలి, రెండో రోజు 11,033 మంది కంటి పరీక్షలు పొందారు. వీరిలో పురుషులు 4,676, మహిళలు 6,008 మంది ఉన్నారు. నేత్ర పరీక్షలు పొందిన వారిలో 3,323 మందికి శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది కళ్లద్దాలను అందజేశారు. మూడో రోజు 44 నేత్ర శిబిరాల్లో 6,493 మందికి కంటి పరీక్షలు జరిపారు. 1,906 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. 1,026 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం ఆర్డర్ చేశారు. నాలుగో రోజు కంటి పరీక్షలు పొందిన 6,497 మందితో కలిసి నాలుగు రోజుల్లో నేత్ర పరీక్షలు పొందిన వారి సంఖ్య జిల్లాలో 24,023కు చేరింది. శిబిరాల్లో ఉదయం 9 గంటలకు నేత్ర పరీక్షలను ప్రారంభిస్తున్న వైద్యులు, సిబ్బంది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిస్తున్నారు. నేత్ర శిబిరాల్లో కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాలను పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.