నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 22,554మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గత నెల నుంచే ఓటు నమోదుకు షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు.
దీంతో నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28,698మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6,144 దరఖాస్తులు తిరస్కరించగా మిగిలిన 22,554 దరఖాస్తుల ఆధారంగా జాబితాను సిద్ధంచేశారు. ఇందులో పురుషులు 13,498మంది, మహిళలు 9056మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ జాబితాను అన్నీ తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నా రు. అభ్యంతరాలను వచ్చే నెల 9వరకు స్వీకరిస్తారు. దీంతో పాటు కొత్త ఓట్ల కోసం దరఖాస్తులకు సైతం అనుమతిస్తున్నారు. 9 తర్వాత వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల 25వరకు తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు.
ప్రస్తుతం ఈ స్థానం నుంచి యూటీఎఫ్కు చెందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకా లం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో ఓటర్ల న మోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ తెరలేపింది. 2019 మార్చి లో జరిగిన గత ఎన్నికల్లో మొత్తం 20,888 మంది ఓటర్లు ఉండ గా ఈసారి ఓటర్ల సంఖ్య పెరగనున్నది. ఇప్పటికే ముసాయిదా జాబితా ప్రకారమే గతంతో పోలిస్తే అదనంగా 1,666 మంది పెరిగారు. తుది జాబి తా ప్రకటించే నాటికి వీరి సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా గతంలో 181 ఉండగా ఈసారి వాటి సంఖ్య 200కు పెరిగింది. అంటే అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు కొత్తగా రానున్నాయి.