ఆలయ సమీపంలో రూ.4.20కోట్లతో నిర్మాణం
ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లు, సూట్లు, బంక్వెట్ హాల్
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సేవలు.. ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభం
ములుగు, ఆగస్టు21(నమస్తేతెలంగాణ) : తెలంగాణలో పర్యాటక రంగానికి మారు పేరుగా నిలిచిన ములుగు జిల్లాలో పర్యాటకుల సౌకర్యం కోసం గట్టమ్మ దేవాలయం వద్ద రూ.4కోట్ల20లక్షల నిధులతో నిర్మించిన ‘హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్’ సేవలకు సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన స్వదేశీ దర్శన్ నిధుల ద్వారా నిర్మించిన ఈ హోటల్ అందుబాటులోకి రావడంతో పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. తెలంగాణ రాష్ట్ర టూరిజం అధికారులు గుజరాత్‌కు చెందిన ‘లాలూజీ అండ్ సన్స్’ అనే కంపెనీ వారికి 20ఏళ్ల పాటు హరిత గట్టమ్మ హోటల్‌ను లీజుకిస్తూ అగ్రిమెంట్ పూర్తి చేశారు. దీంతో కాంట్రాక్టు పొందిన కంపెనీ ప్రతినిధులు హోటల్‌కు ‘హరిత గ్రాండ్ గట్టమ్మ’గా నామకరణం చేశారు.తమకు అనువైన రీతిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని స్థానిక యువతకు ఉపాధి కల్పించి వారం క్రితమే హోటల్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోజూ పర్యాటకులకు సేవలందించేందుకు ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లను ప్రారంభించారు. ఈ హోటల్లో రూములను బుక్ చేసుకునేందుకు harithagrand.com అనే వెబ్సైట్ ద్వారా సౌకర్యం కల్పించారు.
ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లు, సూట్లు, బంక్వెట్ హాల్
గట్టమ్మ ఆలయం వద్ద సుమారు ఎకరం స్థలంలో జాతీయ రహదారి వైపు రెస్టారెంట్ నిర్మించి దాని వెనుకాల ఏసీ, నాన్ ఏసీతో కూడిన 9 రూమ్‌లతో పాటు బంక్వెట్ హాల్ నిర్మించారు. రెస్టారెంట్లోనూ ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో పర్యాటకులకు నోరూరించే పసందైన వంటకాలను ఆర్డర్ ప్రకారం అందిస్తున్నారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన ఈ హోటల్లో విదేశీ పర్యాటకులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.రెస్టారెంట్ పక్కన గార్డెన్ నిర్మించి హట్లు నెలకొల్పారు. ఏసీ గదులకు రోజుకు రూ.4,030, నాన్ ఏసీ గదులకు రూ.1,790గా ధర నిర్ధారించి జీఎస్టీ అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ అందుబాటులోకి రావడంతో స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు పర్యాటకులకు, జిల్లాకు వివిధ పనులపై వచ్చే అధికారులకు, వ్యాపారులకు, ఇతరులకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.